Black Carrots | క్యారెట్లు.. ఈ పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి నారింజ రంగులో ఉండే క్యారెట్లే గుర్తుకు వస్తాయి. కానీ క్యారెట్లలోనూ అనేక వెరైటీలు ఉంటాయి. ముఖ్యంగా మనకు నలుపు రంగులో ఉండే క్యారెట్లు కూడా లభిస్తున్నాయి. ఈ క్యారెట్లలోనూ పోషకాలు అధికంగానే ఉంటాయి. వీటి రంగు కారణంగా ఈ క్యారెట్లను తినేందుకు చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ పోషక విలువలు మాత్రం సాధారణ క్యారెట్ కన్నా నల్ల రంగు క్యారెట్లోనే అధికంగా ఉంటాయి. నలుపు రంగు క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగు క్యారెట్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలను రాకుండా అడ్డుకుంటుంది.
నలుపు రంగు క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. చర్మాన్ని, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలు ఉన్నవారు నలుపు రంగు క్యారెట్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ క్యారెట్లలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం సమస్య నుంచి బయట పడవచ్చు. నలుపు రంగు క్యారెట్లలో పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నలుపు రంగు క్యారెట్లలో ఉండే ఫైబర్ సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ఆంథో సయనిన్స్ గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా రక్షిస్తాయి. ఈ క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఈ క్యారెట్లను తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ క్యారెట్లలో ఉండే ఫైబర్ షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు నలుపు రంగు క్యారెట్లను తింటుంటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
ఈ క్యారెట్లను తింటే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. మెదడు ఆరోగ్యానికి నలుపు రంగు క్యారెట్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిన తింటే మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. బద్దకం పోతుంది. నలుపు రంగు క్యారెట్ల ద్వారా ప్రయోజనాలు పొందాలంటే వీటిని నేరుగా పచ్చిగానే తినాల్సి ఉంటుంది. దీంతో పోషకాలు కూడా అధికంగా లభిస్తాయి. ఈ క్యారెట్లతోనూ కూరలు చేసుకోవచ్చు. ఇలా నలుపు రంగు క్యారెట్ల వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.