Avocado | మన చుట్టూ మనకు అందుబాటులో ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో చాలా వరకు వాటి గురించి ఇంకా మనకు పూర్తిగా తెలియదు. అలాంటి పండ్లలో అవకాడో ఒకటి. దీన్ని చాలా మంది సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు. గ్రీన్ కలర్లో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా అవకాడోలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే ఇవి అత్యంత ఆరోగ్యకరమైన పండ్లని చెప్పవచ్చు. కొందరు వీటితో పలు రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే వారంలో కనీసం 3 సార్లు అయినా అవకాడోలను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అవకాడోలతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
అవకాడోలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తింటే మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఇవి ఆహారాలకు చక్కని రుచిని కూడా అందిస్తాయి. అవకాడోలను వారంలో కనీసం 3 సార్లు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. అవకాడోల్లో అధికశాతం మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడోల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఒక అవకాడో పండులో సుమారుగా 10 గ్రాముల మేర ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అవకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలో ఉండే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను శోషించుకుంటాయి. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. అవకాడోల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో మనకు రోగాలు రాకుండా ఉంటాయి.
అవకాడోల్లో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది బీపీని నియంత్రణలో ఉచుతుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. అవకాడోలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుంది. దీని వల్ల అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గేందుకు, షుగర్ తగ్గేందుకు సహాయం చేస్తుంది. అవకాడోలను మీరు ఎందులో అయినా భాగం చేసుకుని కూడా తినవచ్చు. స్మూతీలు, సలాడ్స్ వంటి వాటిల్లో అవకాడోలను వేసి తినవచ్చు.
అవకాడోలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో శరీరం తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. ఇలా అవకాడోలను వారంలో కనీసం 3 సార్లు తింటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.