Albukhara Fruit | మార్కెట్లో మనకు రకరకాల పండ్లు దర్శనం ఇస్తుంటాయి. వాటిల్లో ఆల్‌బుఖరా పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. టేస్ట్ కూడా పుల్లగా భలేగా ఉంటుంది. ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆల్‌బుఖరా పండ్లు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చు. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆల్‌బుఖరా పండ్లను చూడగానే చాలా మందికి నోరూరిపోతుంది. వీటిని చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆల్‌బుఖరా పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. సాధారణంగా ఇతర పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ ఆల్‌బుఖరా పండ్లను తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఆల్‌బుఖరా పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువ. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి.
ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. జ్వరం వచ్చిన వారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఆహారం తినాలన్న ఆసక్తి పెరుగుతుంది. రుచి లేకపోవడం తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. ఈ పండ్లను తింటే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గిపోతాయి. ఆల్‌బుఖరా పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు. ఈ పండ్లలో ప్రో సైయానిడిన్, నియోక్లోరోజెనిక్ యాసిడ్, క్యూర్సెటిన్ తదితర ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. కనుక ఒళ్లు నొప్పులు లేదా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ పండ్లను తింటే ఉపశమనం పొందవచ్చు.
ఆల్‌బుఖరా పండ్లను తినడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. ఆల్‌బుఖరా పండ్లను కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇతర సమయాల్లోనూ తినవచ్చు. దీంతో రోగాలు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఐరన్, విటమిన్ ఎ కూడా సమృద్ధిగానే ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇలా ఆల్‌బుఖరా పండ్లను తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లు మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.