Ajwain Seeds | మన వంటి ఇంటి పోపు దినుసుల జాబితా చూస్తే అందులో మనం వాడే దినుసులు చాలానే ఉంటాయి. వాటిల్లో వాము కూడా ఒకటి. వామును మనం తరచూ పోపు దినుసులుగా ఉపయోగిస్తుంటాం. అయితే ఆయుర్వేద పరంగా చూస్తే వాము మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వామును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు రకాల అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు వాము చక్కని ఔషధంగా పని చేస్తుందని వారు అంటున్నారు. వాము రుచి ఘాటుగా ఉంటుంది. అందుకని దాన్ని నేరుగా తినలేని వారు కాస్త ఉప్పు చల్లి తినవచ్చు. అలా తిన్న వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా వామును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
వామును నమలడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో చిగుళ్ల వాపులు తగ్గుతాయి. దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాములో థైమోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వామును తింటే బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా శరీరం పోరాడే శక్తి లభిస్తుంది. రోజూ వామును తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు వామును రోజూ తింటే ఫలితం ఉంటుంది.
వాములో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల కడుపు నొప్పికి వాము దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల కడుపు నొప్పులను తగ్గిస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి సైతం తగ్గిపోతుంది. అలాగే అజీర్ణం వల్ల వచ్చే నొప్పిని సైతం వాము తగ్గిస్తుంది. కనుక వామును తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం ముక్కు రంధ్రాలను క్లియర్ చేస్తుంది. దీని వల్ల ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వామును పొడి చేసి ఒక వస్త్రంలో చుట్టి వాసన పీలుస్తుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వామును తినడం వల్ల పొట్లో ఆమ్లాలు తటస్థీకరించబడతాయి. దీంతో గుండెల్లో మంట, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వామును తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. అజీర్ణం తగ్గిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే భోజనం చేసిన అనంతరం వామును తినాలి. దీంతో ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఇలా వామును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.