Blueberries | మనకు తినేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది అనారోగ్యాలను కలిగించే ఆహారాలనే తింటున్నారు. వీటితో రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది స్నాక్స్ పేరిట చిరుతిళ్లను, బేకరీ ఆహారాలను, నూనె పదార్థాలను అధికంగా తింటుంటారు. ఇలా ఎప్పుడో ఒకసారి తింటే ఫర్లేదు. కానీ కొందరికి మాత్రం రోజూ సాయంత్రం సమయంలో ఆయా ఆహారాలు ఉండాల్సిందే. ఇవన్నీ బరువును అధికంగా పెంచుతాయి. కొవ్వు పెరిగేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ వస్తుంది. దీర్ఘకాలంలో లివర్‌లో కొవ్వు కూడా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య రావడంతోపాటు గుండె పోటు కూడా వస్తుంది. కనుక సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. ఈ జాబితా గురించి చెబితే బ్లూ బెర్రీలు ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు.
బ్లూ బెర్రీలు మనకు అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లు మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లతోపాటు పండ్ల దుకాణాల్లోనూ కనిపిస్తుంటాయి. వీటిని డ్రై ఫ్రూట్స్‌గా మార్చి కూడా విక్రయిస్తున్నారు. అయితే బ్లూ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్లూ బెర్రీలను పోషకాలకు నెలవుగా చెబుతారు. వీటిల్లో ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్ అధికంగా ఉంటాయి. క్యాలరీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఒక కప్పు బ్లూ బెర్రీలను తింటే 80 క్యాలరీలు లభిస్తాయి. కనుక అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
బ్లూ బెర్రీలను తినడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు పని ముగించాక బ్లూ బెర్రీలను తింటే కండరాలకు ప్రశాంతత లభిస్తుంది. కండరాలు యాక్టివ్‌గా మారుతాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. బ్లూ బెర్రీల్లో ఉండే మెగ్నిషియం కండరాల వాపులను తగ్గిస్తుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు బ్లూబెర్రీలను తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి వాపులను తగ్గించడంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడిని కంట్రోల్ చేస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
బ్లూ బెర్రీలలో పాలిఫినాల్స్, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా మారి చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్య దూరమవుతుంది. బ్లూబర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి వాపులను, ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లూబెర్రీలను తింటే కంటి ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే యాంథో సయనిన్స్ కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు పెరిగేలా చేస్తాయి. కళ్లలో ఉండే రెటీనా సంరక్షించబడుతుంది. బ్లూబెర్రీలను తింటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం మెరుగు పడుతుంది. ఇలా ఈ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.