Capsicum | ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపించడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు, అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. వేడి వేడి స్నాక్స్ అందుబాటులో ఉంటున్నాయి కనుక ఆరోగ్యకరమైన ఆహారాల జోలికి వెళ్లడం లేదు. అయితే చిరుతిళ్లను ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ రోజూ తింటే మాత్రం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహారాలను రోజూ తినాలని వారు సూచిస్తున్నారు. అలాంటి వాటిల్లో క్యాప్సికం కూడా ఒకటని చెప్పవచ్చు. ఇది పలు రకాల రంగుల్లో లభిస్తుంది. కానీ మనం ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికంనే వంటల్లో వాడుతాం. అయితే ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికంను పెనంపై కాస్త నెయ్యి లేదా బటర్‌తో వేయించి రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి సైతం త్వరగా కోలుకుంటారు. క్యాప్సికంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. దీంతో ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. క్యాప్సికంను తినడం వల్ల గాయాలు, పుండ్లు సైతం త్వరగా నయమవుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్త హీనత తగ్గుతుంది, రక్తం వృద్ధి చెందుతుంది.
క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాప్సికంను తింటే వాపులు, నొప్పులు సైతం తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉండేవారికి మేలు జరుగుతుంది. క్యాప్సికంలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి కనుక దీన్ని తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు కళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కళ్లను రక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడడం కారణంగా కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు.
క్యాప్సికంను తింటే గుండె ఆరోగ్యానికి సైతం మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు రోజూ క్యాప్సికంను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ ఉంటుంది. కనుక దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు రోజూ క్యాప్సికంను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా క్యాప్సికంతో అనేక లాభాలను పొందవచ్చు.