Mint Leaves | పుదీనా ఆకులు ఎంతో రుచిగా, చక్కని వాసనను కలిగి ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీటిని వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని వాసన వస్తుంది. అవి రుచిగా కూడా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్రకారం పుదీనా ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. పుదీనా ఆకులను రోజూ ఉదయం పరగడుపునే తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను తగ్గిస్తాయని వారు అంటున్నారు. పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే ఈ ఆకులను తింటే జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. పుదీనా ఆకులను తినడం వల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోరు ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా ఆకులను ఉదయం తింటే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. ఇది క్యాలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఆహారం తక్కువగా తింటారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పుదీనా ఆకుల్లో సహజసిద్ధమైన డై యురెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఆయా భాగాల పనితీరు మెరుగు పడుతుంది.
పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన డికంజెస్టెంట్గా పనిచేస్తుంది. దీని వల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనాను తీసుకోవడం వల్ల దాని వాసనకు, అందులో ఉండే సమ్మేళనాలకు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మూడ్ బాగుంటుంది. రాత్రి పూట నిద్ర కూడా చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
పుదీనాలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, రోజ్మరినిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. పుదీనా ఆకులను పరగడుపునే 5 నుంచి 7 నమిలి తినాలి. లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. ఈ విధంగా పుదీనా ఆకులను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.