Wheatgrass Juice | ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందిలో శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు సరైన డైట్ కూడా తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలని చూసేవారు, పోషకాలు సమృద్ధిగా కావాలని ఆశించే వారు తమ డైట్లో గోధుమ గడ్డి జ్యూస్‌ను కూడా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గోధుమ గడ్డి జ్యూస్‌ను వారు పోషకాలకు గనిగా అభివర్ణిస్తున్నారు. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. గోధుమ గడ్డి జ్యూస్‌ను ముందుగా 30 ఎంఎల్‌తో ప్రారంభించాలి. తరువాత అవసరాన్ని బట్టి మోతాదు పెంచుతూ పోవచ్చు. రోజుకు 60 ఎంఎల్ మోతాదులో కూడా దీన్ని తాగవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ముందుగా చెప్పినట్లుగానే గోధుమ గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. కనుక దీని జ్యూస్‌ను తాగితే అనేక పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ జ్యూస్‌లో విటమిన్లు ఎ, సి, ఇ, కె లతోపాటు బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. గోధుమ గడ్డిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, సెలీనియం, మాంగనీస్, పాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా అధికంగానే ఉంటాయి. ఈ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు సహాయం చేస్తుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతుంది. గోధుమ గడ్డిలో అనేక అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ గడ్డిలో ఉండే పలు రకాల ఎంజైమ్‌లు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గోధుమ గడ్డిలో అధికంగా ఉండే క్లోరోఫిల్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ కారణంగా ఈ జ్యూస్‌ను సేవిస్తుంటే లివర్, కిడ్నీలు, రక్తం క్లీన్ అవుతాయి. ఆయా భాగాల్లో ఉండే టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. దీంతో శరీరంలోన్ని అవయవాలు క్లీన్‌గా మారుతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్‌ను సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థలో పలు రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయి అందులో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి. అలాగే ఈ గడ్డిలో అధికంగా ఉండే ఫైబర్ పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి గోధుమ గడ్డి జ్యూస్‌ను ఒక వరంగా చెప్పవచ్చు. ఈ జ్యూస్‌ను వారు రోజూ సేవిస్తుంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అధికంగా బరువు ఉన్నవారు రోజూ గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీన్ని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. నడుము పూర్తిగా తగ్గిపోయి నాజూకుగా మారుతారు. ఇలా గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.