ముంబై : ఎలాంటి అలసట, ఒత్తిడి లేకుండా రోజంతా తన బాధ్యతలను (శారీరక, మానసిక) నిర్వర్తించడమే తాను ఫిట్‌నెస్‌కు ఇచ్చే నిర్వచనమని బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి చెప్పారు. ఫిట్నెస్ సీక్రెట్స్‌పై తన లింక్డిన్ ప్రొఫైల్ వ్లాగ్‌లో ఆయన సమగ్రంగా రాసుకొచ్చారు. ఎలాంటి పెద్ద జబ్బులు లేని జీవితం, గుండె, ప్రేవుల ఆరోగ్యంలో ఇబ్బంది లేకుండా ఉండటం, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండటం, తీవ్ర వెన్నునొప్పి, అసిడిటీ వంటి జీవన శైలి వ్యాధులతో బాధపడకుండా ఉండగలగడం..అంటే రోజంతా పనిచేసి అలసట లేకుండా సంతోషంగా ఇంటికి రాగలగడం తన దృష్టిలో ఫిట్నెస్ అని సునీల్ శెట్టి పేర్కొన్నారు.
కుటుంబంతో నాణ్యమైన సమయం వెచ్చించడం ముఖ్యమని వ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్, ఫ్లాట్ స్టమక్లు, బరువు అదుపులో ఉండటం కాదని, మానసికంగానూ మంచి స్ధితిలో ఉండగలగడమని సునీల్ శెట్టి అన్నారు. తాను యువకుడిగా ఉన్న రోజుల్లో దృఢంగా ఉండాలని, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తన రోల్‌మోడల్ అని చెప్పారు.
వయసు పెరుగుతున్న కొద్దీ తాను ఆరోగ్యాన్ని కాపాడుకుని దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. వెన్ను, వెనుక భాగం పటిష్టంగా ఉండేందుకు వ్యాయామాలు చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇలా ఏదో ఒక యాక్టివిటీతో చురుకుగా ఉండాలని, డెస్క్‌లు, ల్యాప్‌టాప్‌లకే పరిమితం కావద్దని సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని అన్నారు. తనను చాలామంది ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని అడుగుతారని దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ ఉండదని అన్నారు.