బర్మింగ్‌హామ్: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ రజావుల్లా(Razaullah) సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో మూడో రోజు అతను పవర్ హిట్టింగ్ తడాఖా చూపించాడు. అరంగేట్రం టెస్టు ఆడుతున్న రజావుల్లా.. తొమ్మిదో నెంబర్ బ్యాటర్‌గా రెండో ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లోకి దిగాడు. అసాధారణ రీతిలో 9 వికెట్‌కు అబ్బాస్‌తో కలిసి 121 రన్స్ జోడించారు. రజావుల్లా 63 బంతుల్లో 81 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 449 రన్స్‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ గెలుపు కోసం 130 రన్స్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మూడో రోజే పాకిస్థాన్ కుప్పకూలింది. కానీ అనూహ్య రీతిలో రజావుల్లా 9వ వికెట్ రూపంలో మెరుపులు మెరిపించాడు. భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.
రజావుల్లా హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు స్టన్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు షాన్ మసూద్ 95, బాబర్ ఆజమ్ 76, అజన్ అవాయిస్ 59 రన్స్ చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓ సెంచరీ చేసిన రికార్డు ఉన్న రజావుల్లా.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 43 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీడ్స్, లార్డ్స్‌లో జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్ మరీ పేలవంగా ఆడింది. బర్మింగ్‌హామ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ 133 పరుగుల స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది. ఈ సిరీస్‌లో తొలిసారి పాక్ 200 స్కోరు దాటింది. తొలి రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం కావడంతో.. పాక్ జట్టు ఏకంగా ఏడుగురు సభ్యులను తొలగించింది.