చక్కెర.. మనిషిని నిశ్శబ్దంగా చంపేస్తుంది. అందుకే, పక్కన పెట్టేయాల్సిన పదార్థాల్లో ముందుంటుంది. ఇక ‘షుగర్ ఫ్రీ డైట్’.. అత్యంత ఆరోగ్యకరమైన మార్పులలో ఒకటిగా గుర్తింపు పొందింది. చక్కెర వినియోగాన్ని తగ్గిస్తే.. మధుమేహం మొదలుకొని బరువు తగ్గడం వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ, చక్కెరను పూర్తిగా పక్కన పెట్టడం కూడా మంచిదికాదని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది.
చికాగోలో ఇటీవల నిర్వహించిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనం చర్చకు వచ్చింది. దీని ప్రకారం.. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వల్ల పేగుల ఆరోగ్యం, శరీరంలో ఇన్ఫ్లమేషన్తోపాటు జీవక్రియలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందట. ఇందుకోసం ఎలుకలపై చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి.. కొన్నిటికి చక్కెర లేకుండా, మరికొన్నిటికి చక్కెరతో కూడిన ఆహారాన్ని అందించారు. 16 వారాల తర్వాత వాటి పేగుల ఆరోగ్యాన్ని పరీక్షించారు. అయితే, చక్కెరను పూర్తిగా పక్కన పెట్టేసిన ఎలుకల జీవక్రియల్లో కొన్ని ప్రతికూల మార్పులను గుర్తించారు. మితిమీరిన చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ, కొన్ని రకాల చక్కెరలను పూర్తిగా తొలగించడం వల్ల ముఖ్యమైన జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని పరిశోధకులు చెప్పుకొచ్చారు.
చక్కెరను పూర్తిగా పక్కన పెట్టేస్తే.. రక్తంలో చక్కెర నియంత్రణ తగ్గడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, పేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడం, పేగుల్లో వాపు/మంటతోపాటు ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులు.. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, జీవక్రియ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సుక్రోజ్ను పూర్తిగా దూరం చేయడం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుందని ఈ కొత్త అధ్యయనం తేల్చింది. కాబట్టి, చక్కెరను పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. కొద్ది మొత్తానికి పరిమితం చేయాలి. అదే సమయంలో ఆహారంలో కార్బోహైడ్రేట్ల నాణ్యత, సమతుల్యతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. తీవ్రమైన ఆహార నియంత్రణల కంటే సమతుల పోషకాహార విధానమే ఎక్కువ ప్రయోజనకరమని ఈ అధ్యయనం ఉద్ఘాటిస్తున్నది.