లండన్ : నొప్పి నివారణ మాత్ర పారాసిటమాల్‌ను నిత్యం వాడేవారిలో రక్తపోటు పెరిగి గుండెపోటు, స్ట్రోక్ ముప్పులకు దారితీయవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది. గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు ఉన్న వారికి పారాసిటమాల్ ప్రిస్క్రైబ్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పరిశోధకులు వైద్యులకు సూచిస్తున్నారు. 110 మంది అధిక రక్తపోటు రోగులపై యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో భాగంగా వీరికి రెండువారాల పాటు రోజుకు ఒక గ్రాము చొప్పున నాలుగుసార్లు పారాసిటమాల్ ఇచ్చారు. పారాసిటమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల తర్వాత రక్తపోటులో గణనీయంగా పెరుగుదల గుర్తించారు.
గుండె పోటు, స్ట్రోక్ ముప్పు 20 శాతం పెరిగేలా వారిలో బీపీ అధికమైందని గమనించారు. బ్రిటన్‌లో ప్రతి పదిమందిలో ఒకరికి నొప్పుల నివారణ కోసం రోజూ పారాసిటమాల్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో తాజా అధ్యయనం వెల్లడించింది. ఇక బ్రిటన్‌లో ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటును పెంచే ఇబూప్రొఫెన్ కంటే పారాసిటమాల్ సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావిస్తుంటామని అయితే గుండెపోటు, స్ట్రోక్ ముప్పున్న వారిలో పారాసిటమాల్ వాడకాన్ని నిలిపివేయాలని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ వీబ్ స్పష్టం చేశారు. నొప్పి నివారణ కోసం అవసరమైతే పారాసిటమాల్‌ను తక్కు వ డోస్‌తో ప్రారంభించి క్రమంగా డోసు పెంచాలని తాము వైద్యులకు సూచిస్తున్నామని చెప్పారు.
అధిక రక్తపోటున్న రోగుల్లో నొప్పి నివారణకు పారాసిటమాల్ వాడితే రక్తపోటు పెరుగుతున్నట్టు కొందరు రోగుల్లో గుర్తించామని తెలిపారు. బీపీ రోగులకు పారాసిటమాల్ సిఫార్సు చేసే వైద్యులు ఈ అధ్యయనం నేపధ్యంలో ఆచితూచి వ్యవహరించాలని వెల్లడైందని చెప్పారు. నొప్పి మాత్రలు తప్పనిసరిగా వాడాల్సిన వారు పారాసిటమాల్‌ను తీసుకుంటే వారి రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రత్యకంగా మందులు వాడాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు వారాల పాటు పారాసిటమాల్‌ను తీసుకుంటే రక్తపోటు గణనీయంగా పెరుగుతోందని గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు ఉన్నవారికి ఇది ప్రమాదకరమని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ క్లినకల్ ఫార్మకాలజీ ప్రొఫెసర్ జేమ్స్ డీర్ హెచ్చరించారు. బీపీ రోగుల్లో అత్యధిక మంది నొప్పినివారణ మాత్ర పారాసిటమాల్‌ను తరచుగా వాడుతుండంతో దీని ప్రభావం అత్యధికంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.