న్యూఢిల్లీ : జీవనశైలి వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కోట్లాదిమందిని బాధిస్తోంది. మధుమేహంతో ఏటా పలువురు హృద్రోగాలు, ఇతర తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్నారు. అయితే డిన్నర్‌తో పాటు రోజూ ఓ గ్లాస్ వైన్ తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరకుండా చూసుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ల ద్వారా ఈ డ్రింక్‌ను డిన్నర్‌తో తీసుకుంటే టైప్ 2 డయాబెటిక్ బారినపడే ముప్పు 14 శాతం తక్కువని అధ్యయనం తెలిపింది. 3,00,000 మంది బ్రిటన్ల డేటాను 11 ఏండ్ల పాటు పరిశీలించిన మీదట అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది.
భోజనంతో పాటు వైన్ తీసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయని, ఆహారం లేకుండా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కంటే కీడు అధికమని అధ్యయనం హెచ్చరించింది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకుంటేనే మధుమేహ నియంత్రణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం సంకేతాలు పంపిందని న్యూ ఓర్లియన్స్ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఇతర వ్యాధులు ఏవీ లేని వ్యక్తి ఈ తరహాలో వైన్ తీసుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ఇక మహిళలు రోజుకు ఒక గ్లాస్ వైన్, పురుషులు రోజుకు రెండు గ్లాసుల వైన్ తీసుకుంటే వారు మధుమేహం బారినపడే ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు లేని బీర్ వంటి ఇతర మద్యంలో ఈ ప్రభావం కనిపించదని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే రైడ్ వైన్ లేదా వైట్ వైన్‌లో ఈ తరహా ప్రయోజనాలు అధికంగా ఉంటాయా అనే దానిపై మరింత పరిశోధన అవసరమని అధ్యయనం తెలిపింది.