ఒత్తిడివల్ల మానసిక, శారీరక సమస్యలతోపాటు దంత సమస్యలూ తలెత్తుతాయట. ఇటీవల ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఉదయం నిద్ర లేవగానే పంటినొప్పి లేదా దవడ నొప్పి ఇబ్బంది పెడుతున్నదంటే, రాత్రిపూట ఏదో ఆలోచిస్తూ పటపటా పళ్లు కొరుకుతున్నారని అర్థం. దీనికికూడా ఒత్తిడే కారణమని తేలింది. జనాల్లో దాదాపు 10నుంచి 36శాతం మంది రాత్రిళ్లు రకరకాల ఆలోచనలు, ఒత్తిళ్లతో పళ్లు కొరికేస్తున్నారట.
ఆ రాపిడికి దంతాలు బలహీనపడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, ఒత్తిడితో ఉండేవారు నిద్రపోయే ముందు మౌత్ గార్డ్ వాడటం మంచిదని డెంటిస్ట్‌లు సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం, డీప్ బ్రీతింగ్లాంటివి అలవాటు చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. టీవీల్లో కామెడీ షోలు, పాత సినిమాలు చూడటమూ ఓ మార్గమేనని అంటున్నారు.