న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో దాదాపు అందరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీసే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి మెదడులో గ్రే మ్యాటర్‌ను తగ్గిస్తుందని ఫలితంగా ప్రతికూల పరిస్ధితులను అధిగమించేందుకు మనకున్న సెల్ఫ్ కంట్రోల్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
ఒత్తిడి మన ఆలోచనలు, ప్రవర్తన, భావాలపై ప్రభావం చూపుతుందని, ఇది పరిమితి మించితే పలు లక్షణాలు బయటపడతాయని ఆసియన్ ఆస్పత్రిలో సైకియాట్రీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి మన్‌చందా పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా తరచూ తలనొప్పి, కండరాల నొప్పులు, తీవ్ర అలసట, కడుపు నొప్పి, కడుపుబ్బరం, అసిడిటీ, నిద్ర లేమి, అతి నిద్ర, యాంగ్జైటీ, కుంగుబాటు, కోపం, ప్రతికూల ఆలోచనలు బాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఒత్తిడిని అధిగమించేందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, మసాజ్, మెడిటేషన్, యోగ, మ్యూజిక్ థెరఫీ, అరోమా థెరఫీ వంటివి ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా, ఒత్తిడికి గురిచేసే పనులు, బాధ్యతలు అప్పగించాలని చూస్తే వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సన్నిహితంగా మెలగడం, సమతులాహారం, రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్ర, హాబీలను అలవరచుకోవడం వంటివి పాటిస్తే ఒత్తిడిని చిత్తు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.