Stomach Cancer | పొట్ట క్యాన్సర్.. అంతగా చర్చకురాని తీవ్ర వ్యాధి. రుగ్మత లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. పొట్ట క్యాన్సర్ విషయంలో ఐదు సాధారణ లక్షణాలను గమనించాలి. కచ్చితమైన నిర్ధారణ కోసం త్వరగా వైద్యులను సంప్రదించి, మంచి చికిత్స తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
కడుపులో అసౌకర్యం
కడుపులో తీవ్ర అసౌకర్యం, నొప్పి. దీన్ని అజీర్తిగానో, చిన్నపాటి జీర్ణ సమస్యగానో అపోహపడతారు చాలామంది. కడుపు పైభాగంలో ఎడతెగని నొప్పి ఉందంటే అది పొట్ట క్యాన్సర్ సంకేతం కావచ్చు. మామూలు మందులు వాడినా, జీవనశైలి మార్పులు చేసుకున్నా.. సమస్య తగ్గలేదంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
అకస్మాత్తుగా బరువు తగ్గడం
ఎలాంటి ప్రయత్నాలూ లేకుండానే బరువు తగ్గడం పొట్ట క్యాన్సర్కు తొలి హెచ్చరిక. బరువు తగ్గడం ఒక్కటే కాకుండా.. కడుపునొప్పి లాంటివి కూడా బాధిస్తుంటే జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందని అర్థం.
వికారం, వాంతులు
విడువకుండా వికారం, వాంతులు ఇబ్బంది పెడుతుంటే.. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య ఉంటే తేలిగ్గా
తీసుకోవద్దు. తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మింగడంలో ఇబ్బంది
వైద్య పరిభాషలో ఈ ఇబ్బందిని డిస్ఫేజియా అని పిలుస్తారు. ఇది తక్షణమే దృష్టి సారించాల్సిన లక్షణం. మొదట్లో ఘన పదార్థాలు తినడం ఇబ్బందికరంగా ఉంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ ద్రవ పదార్థాలు కూడా లోపలికి వెళ్లవు.
అకారణమైన అలసట
ఏ శ్రమా లేకుండానే అలసట, బలహీనత పీడిస్తున్నాయంటే… పొట్ట క్యాన్సర్ సహా బయటికి కనిపించని ఆరోగ్య సమస్యకు ఇది సంకేతం కావచ్చు. రోజువారీ ఒత్తిళ్ల కారణంగా అలసటను అంతగా పట్టించుకోరు చాలామంది. వెంటనే, వైద్యులను సంప్రదించి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది.