Star Anise | మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలా మంది చూసే ఉంటారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే కచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా అనాస పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే వ్యాధులను తగ్గించడంలోనూ అనాస పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. అనాస పువ్వునే స్టార్ అనిస్ అని, చక్ర ఫూల్ అని కూడా పిలుస్తారు. ఇందులో షికిమిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. దగ్గు, జలుబు, ఫ్లూ, ఇతర జ్వరాలను తగ్గిస్తుంది. అనాస పువ్వును వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
అనాస పువ్వులో అనెథోల్, లినాలూల్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. కనుక బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు అనాస పువ్వును వాడితే ఫలితం ఉంటుంది. దీంతో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనాస పువ్వులో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం అనాస పువ్వులో ఉండే అనెథోల్ అనే సమ్మేళనం షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. దీంతో కార్బొహైడ్రేట్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేవిస్తుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అనాస పువ్వులో ఉండే సమ్మేళనాలు బీపీని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ఫలితంగా గుండె కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు.
అనాస పువ్వును పూర్వ కాలం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని వాడితే కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అనాస పువ్వులో ఉండే అనెథోల్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. అనాస పువ్వులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దగ్గు, జలుబు, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు అనాస పువ్వు నీళ్లను తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఇలా అనాస పువ్వు మనకు ఎంతగానో మేలు చేస్తుంది.