Gingivitis | బ్రష్ చేసుకున్నాక కానీ, దంతాల మధ్య ఖాళీని దారంతో శుభ్రం చేసుకునే ఫ్లాసింగ్ ప్రక్రియ తర్వాత కానీ ఉమ్మి గులాబీ రంగులో పడితే.. అది చిగుళ్ల వ్యాధికి సంకేతం. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే చిగుళ్ల వ్యాధి ముదిరిపోతుంది. క్రమంగా దంతాలు రాలి పోతాయి. డెమెన్షియా, మధుమేహం, గుండె వ్యాధులకూ దారితీస్తుంది.
చిగుళ్ల వ్యాధిని జింజివైటిస్ అని పిలుస్తారు. చిగుళ్ల వాపు (జింజివా) దీని ప్రధాన లక్షణం. పండ్లమీద పాచి-బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో చిగుళ్లు మండుతాయి. పండ్ల మధ్య సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల జింజివైటిస్ సమస్య తలెత్తుతుంది. పండ్ల వెనక భాగంలో బ్రషింగ్ సరిగ్గా చేయలేం కాబట్టి, కొన్నిసార్లు ఆ ప్రాంతంమాత్రమే జింజివైటిస్ వల్ల ప్రభావితం అవుతుంది. చిగుళ్లు, పండ్ల మధ్య దూరాన్ని బట్టి దంతవైద్యులు జింజివైటిస్ను నిర్ధారిస్తారు. చిగుళ్లు, పండ్ల మధ్య దూరం ఎక్కువైతే ఈ సమస్య ఉన్నట్టే. జింజివైటిస్కు చికిత్స తీసుకోకపోతే.. చిగుళ్ల కింద ఉండే కణజాలంపై బ్యాక్టీరియా దాడిచేసి ధ్వంసం చేస్తుంది. దాంతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది. ఫలితంగా పండ్లకు ఆధారమైన ఎముక క్షీణించడం మొదలవుతుంది. పండ్లు సున్నితంగా మారిపోతాయి. పండ్ల మధ్య ఖాళీలు ఏర్పడతాయి.
ఎవరిలో ఎక్కువ?
ధూమపానం చేసేవాళ్లు, డయాబెటిస్ రోగులు, పండ్లు కొరికే అలవాటు ఉన్నవారిలో చిగుళ్ల వ్యాధులకు ఆస్కారం ఎక్కువ. స్టెరాయిడ్లు, క్యాన్సర్ మందులు లాంటివి ముప్పును పెంచుతాయి. జన్యుపరంగా కూడా అవకాశం ఉంది. మిగిలిన వాళ్లతో పోలిస్తే.. పండ్లలో కావిటీస్ ఉన్నవారిలో చిగుళ్ల వ్యాధుల ముప్పు ఎక్కువ. దీనికి కారణం ..చిగుళ్ల వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా, కావిటీకి కారణమయ్యే బ్యాక్టీరియా.. రెండూ ఒకదానితో ఒకటి పోటీపడి పెరిగిపోవడమే. అందుకే తీవ్రమైన పండ్ల సమస్య ఉన్నవారికి ఒకటికంటే ఎక్కువ కావిటీలు సర్వసాధారణం. నొప్పి కలిగించదు కాబట్టి, జింజివైటిస్ను చాలావరకు గుర్తించలేం. అయితే బ్రష్ చేస్తున్నప్పుడో, పండ్ల మధ్య శుభ్రం చేసుకుంటున్నప్పుడో చిగుళ్ల నుంచి రక్తం కారడం జింజివైటిస్ రోగుల్లో సహజం. జింజివైటిస్ ఉన్న చిగుళ్లు గులాబీ రంగులో కాకుండా ఎరుపు రంగులో కనిపిస్తాయి.
ఏం చేయాలి?
ఒక్కసారి జింజివైటిస్ బారినపడ్డామంటే, చిగుళ్ల లోతుల్లో బ్యాక్టీరియా పేరుకుంటుంది. దంత వైద్యుల సమక్షంలో నోటిని శుభ్రం (ప్రొఫెషనల్ క్లీనింగ్) చేయించుకోవాలి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. జింజివైటిస్ ఎక్కువయ్యే కొద్ది చిగుళ్లు తగ్గిపోతుంటాయి. దాంతో పండ్లు పొడుగ్గా కనిపిస్తాయి. చిగుళ్ల దగ్గర నొప్పి ఎక్కువ అవుతుంది. పండ్ల మధ్య దూరం పెరగడంతో ఆహార పదార్థాలను కొరకడం కష్టమైపోతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. చివరికి పండ్లు వదులైపోయి, ఊడిపోతాయి. చిగుళ్లు, దంతమూలాలు ధ్వంసమైపోకుండా తగిన చికిత్సలు చేస్తారు చిగుళ్ల వ్యాధుల నిపుణులు (పెరియోడాంటిస్టులు). పాడైపోయిన పండ్ల కుదుళ్ల దగ్గర శుభ్రం చేస్తారు. అవసరమైతే చిగుళ్లకు శస్త్రచికిత్స చేస్తారు. ఈ బాధలన్నీ ఎందుకు అనుకుంటే.. దంతాల ఆరోగ్యం పట్ల ముందు నుంచీ శ్రద్ధ వహించాలి.