Dry Dates | మార్కెట్లో మనకు ఖర్జూరాలు రెండు రకాలుగా లభిస్తాయి. సాధారణ ఖర్జూరాలు ఒక రకం కాగా.. ఎండు ఖర్జూరాలు మరో రకం. సాధారణ ఖర్జూర పండ్లనే చాలా మంది తింటుంటారు. ఎండు ఖర్జూరాలను హిందూ వివాహ కార్యక్రమాల్లో, ఇతర శుభ కార్యాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణ ఖర్జూరాల్లాగే ఎండు ఖర్జూరాలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖర్జూరాల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ రాత్రి పూట 2 ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని అల్పాహారంతోపాటు తినాలని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఎండు ఖర్జూరాల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ విటమిన్లు వీటిల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియలు సరిగ్గా నిర్వహించడంలో దోహదం చేస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీర మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. ఎండు ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల వీటిని నీటిలో నానబెట్టి తింటే ఉదయమే శరీరానికి కావల్సిన తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట రాదు.
ఎండు ఖర్జూరాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తింటే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. పోషకాహార లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఎండు ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపు చేస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే ఎండు ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
ఎండు ఖర్జూరాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ వీటిని తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఎముకలు పటిష్టంగా మారి ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి దోహదపడుతుంది. అందువల్ల ఈ ఖర్జూరాలను తింటే రక్తహీనత తగ్గుతుంది. రక్తం కావల్సినంత తయారవుతుంది. ఎండు ఖర్జూరాల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఈ ఖర్జూరాలను తింటే చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మ కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా రోజూ రెండు నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే అనేక లాభాలను పొందవచ్చు.