Heart Attack | ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతున్నది. జీవనశైలి కారణంగా చాలా మంది హృదయ సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ముప్పు మరింత తీవ్రంగా ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కిందటి వరకు గుండెపోటు అంటే వృద్ధులకే వచ్చేదనే అభిప్రాయం ఉండేది. అయితే, ఇటీవల కాలంలో యువత గుండె సంబంధిత సమస్యలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు 30 ఏళ్లలోపు యువకులు హార్ట్ ఎటాక్ బారినపడగా.. ఆరో తరగతి చదువుతున్న 12 సంవత్సరాల బాలుడు సైతం గుండెపోటుకు గురై మృతి చెందాడు. అత్యంత పిన్న వయసులో బాలుడికి గుండెపోటురావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నారు. దేవభూమి ద్వారకకు చెందిన దుష్యంత్ పిప్రోటార్ అనే 12 సంవత్సరాల బాలుడి మృతి చెందాడు. ద్వారకలోని భన్వాద్ తాలూక ఓ ప్రాథమిక పాఠశాలలో అతను చదువుతున్నాడు. ఇటీవల రాజ్‌కోట్‌కు చెందిన 23 సంవత్సరాల యువకుడు ఛాతిలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు.
అయితే, చిన్న వయస్సులోనే గుండెపోటు సమస్యలు పెరుగుతుండడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొంటున్నారు. గతంలో గుండెపోటు 40-50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు మాత్రమే వచ్చేవని.. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వ్యక్తుల్లో రావడం అరుదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఐదుగురు బాధితులో ఒకరు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు ఉంటున్నారని పేర్కొంటున్నారు. 20-30 ఏళ్లలోపు వారికి సైతం గుండెపోటు సర్వసాధారణంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. 2000-2016 మధ్య చిన్న వయసులో వచ్చే ఘటనలు హార్ట్ ఎటాక్‌లు రెండుశాతం పెరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కార్డియాలజిస్ట్ సుయాష్ నిరంజన్ మాట్లాడుతూ.. యువకుల్లో గుండెజబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత హృదయ సంబంధిత సమస్యలు పెరిగాయని, జీవనశైలిలో వచ్చిన విపరీత పోకడలు ప్రమాదాన్ని పెంచాయన్నారు. స్థూలకాయం కారణంగా గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని పలు పరిశోధనలు గుర్తించాయని పేర్కొన్నారు. అలాగే యువతలో హైబీపీ (రక్తపోటు) పెరుగుతోందని, హార్ట్ ఎటాక్‌లు పెరగడానికి యువతలో రక్తపోటు సమస్య కూడా ఓ కారణమన్నారు. అధిక బరువు బీపీకి కారణమవుతుందని, దీని కారణంగా ధమనులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుందని.. ఇది గుండెపోటుకు ప్రధాన కారణమని.. అంతే కాకుండా స్ట్రోక్‌కు సైతం కారణమవుతుందని ఆయన వివరించారు.