ఆయుర్వేదం.. ప్రపంచంలోనే పురాతన వైద్య విధానం. అలోపతికి ప్రత్యామ్నాయంగా నేడు అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది. వివిధ రకాల వ్యాధులతోపాటు రుగ్మతలను నయం చేయగలిగే సామర్థ్యం దీనికుంది. ఆయుర్వేద ఔషధాలన్నీ సహజమూలికలు, పండ్లు, ఇతర మూలకాలతోనే తయారు చేస్తారు. ఇందులో ముఖ్యంగా త్రిఫల చూర్ణాన్ని చాలామంది వాడుతుంటారు. అయితే, దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
త్రిఫల చూర్ణం..ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. ఈ పౌడర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. త్రిఫల సప్లిమెంట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ చూర్ణాన్ని ఎక్కువగా వాడితే అసలుకే మోసం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే మేలుకంటే హానీ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.