వానాకాలం అంటే జల్లులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో చుట్టూ ఉన్న పరిసరాలు ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు పెరగడానికి అనువుగా ఉంటాయి. దీంతో సీజనల్ వ్యాధులు డేంజర్ బెల్స్ మోగిస్తుంటాయి. ప్రత్యేకించి ఈ మధ్య స్వల్ప విరామంతో అడపాదడపా కురుస్తున్న వానలతో దోమల వృద్ధి పెరిగింది. దీంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా లాంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు,దగ్గు, జ్వరం పీడిస్తున్నాయి. ఏటా సీజనల్ వ్యాధుల దాడి సర్వసాధారణమే. కానీ, చాలామందిలో వీటి గురించి అంతగా అవగాహన లేకపోవడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా రోగాల బారినపడి దవాఖానల పాలవుతున్నారు.
ఈ నేపథ్యంలో వానాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులపై అవగాహన తప్పనిసరి.సాధారణంగా మనిషి శరీరం ఏదైనా ఒక కాలంలోని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడుతుంది. అయితే, ఆ కాలం మారిపోయి కొత్త వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు మన శరీరం వెంటనే ఆ మారిన పరిస్థితులకు తట్టుకోదు. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా వాతావరణ మార్పుల కారణంగా దోమల వంటి కీటకాలు విజృంభించినప్పుడు అవి మనుషులపై దాడి చేయడం వల్ల కూడా వ్యాధులు ప్రబలుతాయి.
ఈ విధంగా ఒక నిర్ణీతకాలంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే వ్యాధులను సీజనల్ వ్యాధులుగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని రకాల వ్యాధులు ఇతర సమయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ బాండబుల్ డిసీజెస్ అంటే నీటివల్ల వచ్చే వ్యాధులు, దోమల్లాంటి కీటకాల వల్ల తలెత్తే వెక్టర్ బాండబుల్ డిసీజెస్ వస్తాయి. ఇవికాకుండా వాతావరణ పరిస్థితుల వల్ల వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా పీడిస్తుంటాయి. అయితే, సీజనల్ వ్యాధులు అంత ప్రమాదకరం ఏమీ కాకపోయినా సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు.
రాత్రి దోమలు – పగటి దోమలు
సాధారణంగా దోమలను రెండు రకాలుగా పరిగణిస్తారు. ఒకటి రాత్రిపూట కుట్టేవి, రెండు పగటి సమయంలో కుట్టేవి. అనాఫిలిస్, క్యూలెక్స్ రకం దోమలు రాత్రిపూట కుడతాయి. వీటి కారణంగా మలేరియా, ఫైలేరియా (బోదకాలు), మెదడువాపు, లాంటి వ్యాదులు వస్తాయి. మెదడువాపు ఎక్కువగా 5 ఏండ్ల లోపు పిల్లలకు వస్తుంది. దీనికి ప్రధాన కారణం పందులు. అంటే దోమలు పందులకు కుట్టి, ఆ తరువాత మనుషులను కుడితే వారికి మెదడువాపు వస్తుంది. దీనివల్ల పిల్లల్లో మెదడు వాచిపోతుంది.
ఫిట్స్ వచ్చి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాకపోతే, ఇప్పుడు ఈ వ్యాధి తెలంగాణలో పెద్దగా లేదు. ఇక ‘ఈడిస్ట్ ఈజిైప్టె’ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. అంతేకాకుండా ఇతర దోమల్లా ఇవి మురికి నీటిలో ఉండవు. మంచినీటిలో అంటే ఇళ్లలోని పూలకుండీలు, కూలర్లు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచిన గుంతలు, పేరుకుపోయిన కొబ్బరినార, రబ్బరుటైర్లు వంటివాటిలో నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి కుట్టడం వల్ల డెంగీ, చికున్‌గున్యా వస్తాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటువ్యాధులు కావు.
కలుషిత నీటి కారణంగా…
వానాకాలంలో జలాశయాల్లోకి వరద ద్వారా కొత్తనీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా వర్షకాలంలో వరదల కారణంగా ఇళ్లకు సరఫరా చేసే తాగునీరు కూడా కొన్నిసార్లు కలుషితం కావడానికి ఆస్కారం ఉంది. కలుషిత నీరు తాగినప్పుడు, ఆ నీటితో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు టైఫాయిడ్, డయేరియా, కామెర్లు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటిస్ తదితర వ్యాధులు వస్తాయి. ఇవే కాకుండా హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల్లో కల్తీ వస్తువులతో తయారుచేసే ఆహార పదార్థాల వల్ల కూడా జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
వైరల్ ఫీవర్స్ లేదా ఫ్లూ
వానాకాలంలో గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల వైరస్లు చురుగ్గా మారుతాయి. వైరస్ అనేది గాలిలో తేలడమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఇది శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తుంది. వైరస్ల దాడి కారణంగా వచ్చేవే వైరల్ ఫీవర్స్. ఇవి ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి కూడా సోకుతాయి. అంటే వైరల్ ఫీవర్ అనేది అంటువ్యాధి. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అతని నోటి తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది.
వైరల్ ఫీవర్స్ లక్షణాలు
చికిత్స: వైరల్ ఫీవర్స్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ ఉండదు. లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ అందిస్తారు. జ్వరం ఉన్నవారికి జ్వరం తగ్గడానికి, జలుబు, దగ్గు ఉంటే వాటినుంచి ఉపశమనానికి అవసరమైన చికిత్స చేస్తారు.
డెంగీ లక్షణాలు
నిర్ధారణ పరీక్షలు: డెంగీ జ్వరాన్ని ఎన్ఎస్1 యాంటిజెన్ పరీక్షల ద్వారా నిర్ధారణ చేయవచ్చు. వారం తరువాత అయితే ఐజీఎం పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
చికిత్స: బీపీ పడిపోకుండా తరచు ద్రవ పదార్థాలు ఇవ్వడం తప్పనిసరి. డెంగీకి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీలేదు. లక్షణాల ఆధారంగా సింప్టమేటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా తక్కువమందికి మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది.
జాగ్రత్తలు
నిర్ధారణ పరీక్షలు: రాపిడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారించవచ్చు.
చికిత్స: యాంటీమలేరియా మాత్రలు 3 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది.
చికున్‌గున్యా
డెంగీ కారకమైన ఈడిస్ ఈజిైప్టె అనే దోమకాటు వల్లనే చికున్‌గున్యా కూడా వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు తీవ్రమైన కీళ్లనొప్పులు, జ్వరం. దీనికి కూడా లక్షణాల ఆధారంగానే చికిత్స ఇస్తారు. చికున్‌గున్యా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కీళ్లనొప్పులు ఎక్కువకాలం ఉండే అవకాశం ఉంటుంది.
టైఫాయిడ్ లక్షణాలు
నిర్ధారణ పద్ధతి: బ్లడ్ కల్చర్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు
చికిత్స: ఎజిత్రోమైసిన్ మాత్రలు
7 రోజులు లేదా సెఫ్ట్రై ఆగ్జోన్ అనే
ఇంజెక్షన్ తీసుకోవాలి.
ముందు జాగ్రత్తలతో చెక్
సీజనల్ వ్యాధులను కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా దోమల బెడద నుంచి రక్షణ పొందే విధంగా జాగ్రత్తలు పాటించాలి. ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో పాతసామాన్లు, పడేసిన కొబ్బరిచిప్పలు, రబ్బరు వస్తువులు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. రాత్రుళ్లు దోమలు కుట్టకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు లాంటివి వాడాలి. దీనివల్ల డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి విషజ్వరాల బారినుంచి తప్పించుకోవచ్చు. ఇక కలుషిత ఆహారం, కలుషిత నీరుతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలు సాధ్యమైనంత వరకు తీసుకోవడం మానేయాలి. ఇలాచేస్తే డయేరియా, టైఫాయిడ్, కామెర్లు మొదలైన వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు.
…?మహేశ్వర్‌రావు బండారి
డా॥ కె.శంకర్
ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్
జనగాం ప్రభుత్వ హాస్పిటల్