మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండటానికి సూత్రాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనో, మెడిటేషన్ యాప్స్లోనో ఉంటాయనుకుంటారు. కానీ, మనం తినే ఆహారంలోనే ఆ రహస్యం దాగుంది. అన్నం ఎలా ఉంటే మన మనసు అలా ఉంటుందని పెద్దల మాట. అందుకే సాత్విక ఆహారానికి ఆయుర్వేదం, యోగా ఎంతో ప్రాధాన్యం ఇచ్చాయి.
సాత్విక ఆహార పదార్థాలు సరళంగా, సహజంగా, జీవం ఉట్టిపడుతూ ఉంటాయి. తాజా పండ్లు, రంగురంగుల కూరగాయలు, ముతకధాన్యాలు, గింజలు, మొలకలు, పాలు, నెయ్యి వంటివి సాత్విక ఆహారం కిందికి వస్తాయి. ఇవి తేలిగ్గా అరగడమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి సరైన పోషణను అందిస్తాయి. సాత్వికాహారం సహజంగానే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. సాత్వికాహారం జీవక్రియలు సాఫీగా సాగేలా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.