ఒకప్పుడు ఆపరేషన్ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి మరీ చేయాల్సి వచ్చేది. సర్జరీ అవసరమైన చోట ఆ శరీర భాగంపై కోతపెట్టి లోపలి అవయవాలను సరిచేసే వాళ్లు. కానీ, అధునాతన వైద్యరంగం సంక్లిష్టత లేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. ఈ క్రమంలో వచ్చిందే లాపరోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు దీనికన్నా ఆధునికమైన రోబోటిక్ సర్జరీలు వచ్చేశాయి. కిడ్నీలకు (మూత్రపిండాలు) సంబంధించిన సమస్యల్లో కూడా రోబోలు చకచకా సర్జరీలు చేసేస్తున్నాయి. అంతే కాదు ఆపరేషన్ చేసేది రోబోనే అయినప్పటికీ అంతా డాక్టర్ నియంత్ర ణలోనే జరిగిపోతుంది. పైగా రోబోటిక్ సర్జరీలు చాలా కచ్చితత్వంతో, అతి తక్కువ రక్తస్రావంతో అయిపోతాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్యల్లో సర్జరీల పనితీరు గురించి తెలుసుకుందాం.
వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చినా రోగి భద్రతే అంతిమ లక్ష్యంగా ఉంటుంది. మెరుగైన వైద్యాన్ని, సౌకర్యవంతంగా, సురక్షితంగా అందించే దిశగా నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటి ఫలితమే రోబోటిక్ సర్జరీ. మొదట్లో సర్జరీ అంటేనే పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీయే. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినవైతే ఛాతీ తెరిచి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. పొట్టలో అవయవాల సమస్యలకైతే పొట్టపై గాటు పెట్టాల్సిందే! కానీ, లాపరోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద కోత అవసరం లేకుండా, మూడు నాలుగు రంధ్రాలు మాత్రమే పెట్టి చేసే ‘కీహోల్ సర్జరీ’ రోగులకు వరమైంది. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లకు కూడా లాపరోస్కోపీ చేసేవాళ్లు. అయితే లాపరోస్కోపిక్ సర్జరీల్లో ఉండే లోపాలు కూడా లేని సాంకేతికత రోబోటిక్ సర్జరీ.
ఓపెన్ సర్జరీ విధానంలో కిడ్నీలు, ఇతర మూత్రవ్యవస్థ అవయవాలను చూడాలంటే కూడా పెద్ద కోత తప్పనిసరి. ఇందుకోసం 15 నుంచి 20 సెం.మీ. కోత పెట్టాల్సి వచ్చేది. అందువల్ల నొప్పి తీవ్రంగా ఉండేది. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు ఇచ్చేవాళ్లు. ఈ మాత్రల వల్ల దుష్ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉండేది. పైగా కోత పెట్టి ఓపెన్ చేస్తారు కాబట్టి శస్త్రచికిత్స సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. దీంతో రోగి కోలుకోవడానికి ఎక్కువ కాలం పట్టేది. హాస్పిటల్లోనే 10 రోజులు ఉండాల్సి వచ్చేది. ఆ తర్వాత కోలుకోవడానికి 15 నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఆపరేషన్ సమయంలో పెట్టిన గాటు గాయంగా మారే ప్రమాదమూ ఉండేది. ఇది తొందరగా మానకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చేవి. అంతేకాదు హెర్నియా లాంటి సమస్యలు కూడా ఎదురయ్యేవి. అప్పుడు సమస్య మరింత జటిలంగా మారేది.
లాపరోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత శరీరానికి కోతల బాధ తప్పింది. కత్తుల గాట్లు లేకుండా చిన్న చిన్న రంధ్రాలతో లోపలికి కెమెరా, లాపరోస్కోపిక్ పరికరాన్ని పంపి సర్జరీ చేయవచ్చు. లోపలి అవయవాలను తెర మీద స్పష్టంగా చూస్తూ సర్జరీ చేయవచ్చు. లాపరోస్కోపిక్ పరికరం 2డి విజన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల లోపలి అవయవాలను 2 డైమెన్షనల్‌గా చూపిస్తుంది. కోత ఉండదు. కేవలం ఒక్క సెంటీమీటర్ రంధ్రం పెడితే చాలు. ఇలాంటి రంధ్రాలు మూడు నాలుగు చేస్తారు. పెద్ద గాట్లు ఏమీ ఉండవు కాబట్టి ఆపరేషన్ సమయంలో జరిగే రక్తం నష్టం చాలా తక్కువగా ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్లో మూడు నాలుగు రోజులుంటే చాలు.
ఆ తర్వాత తొందరగా కోలుకుంటారు. అయితే, కొన్ని ప్రొసీజర్లను లాపరోస్కోపీలో చేయడం చాలా కష్టం. ఉదాహరణకు రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్లను లాపరోస్కోపీ ద్వారా చేయడం కష్టం. మూత్రనాళం బ్లాక్ అయినప్పుడు దాన్ని కత్తిరించి అడ్డు తీసేసి మళ్లీ కలపాల్సి ఉంటుంది. అయితే, లాపరోస్కోపీలో కుట్లు వేయడం కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వచ్చేది. అదేవిధంగా కిడ్నీలో ట్యూమర్ ఉంటే కణితి వరకే తీసేసి మిగిలింది కుట్లు వేయాలి. ఇది లాపరోస్కోపీతో కష్టం. దీనికి ఎంతో నైపుణ్యం అవసరం. ఎంతో అనుభవం కావాలి. స్థూలకాయం ఉన్నవాళ్లలో కూడా ఆపరేషన్ లాపరోస్కోపీతో కష్టమవుతుంది.
రోబోతో చేసే సర్జరీకి డాక్టర్ చేతులు అవసరం లేదు. రోబో చేతులతోనే సర్జరీ చేయిస్తారు. తెరమీద లోపలి అవయవాలను చూస్తూ రోబో పరికరాన్ని ఎటువైపు ఎలా తిప్పాలనేది డాక్టర్ కంట్రోల్ చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తుంటాయి. రోబోటిక్ సర్జరీకి కూడా పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి కూడా లాపరోస్కోపీ లాగానే ఒక్క సెంటీమీటర్ రంధ్రాలు మూడు నాలుగు వేయాలి. రోబోటిక్ సర్జరీ చేయడానికి పెద్దగా స్కిల్స్ అవసరం లేదు. టెక్నాలజీ తెలిసి, కొద్దిగా అనుభవం ఉంటే చాలు. లాపరోస్కోపీ ద్వారా చేయలేని సర్జరీలను రోబోతో చేయొచ్చు.
రోబో యంత్రానికి 3డి విజన్ ఉంటుంది. అందుకే లోపలి అవయవాలను 3 డైమెన్షనల్‌గా చూడవచ్చు. ఓపెన్ సర్జరీలో డాక్టర్ తన చేతులతో చేసినట్టు ఇక్కడ రోబో చేతులతో చేయించవచ్చు. మన చేతులను గుండ్రంగా తిప్పగలిగినట్టుగానే రోబో చేయిని కూడా 360 డిగ్రీలలో తిప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మనుషుల చేయి కన్నా కూడా బెటర్. అప్పుడప్పుడు చేయి వణికి అటు ఇటు కదిలిపోవచ్చు. కానీ, రోబో చేయి వణకదు. లాపరోస్కోపీలో అయితే ఒకరు కెమెరా పట్టుకుని ఉండాలి. ఇందులో రోబో యంత్రానికే కెమెరా అమర్చి ఉంటుంది. లోతుగా ఉండే భాగాలకు చేసినప్పుడు కూడా సర్జరీ సులువు అవుతుంది. స్థూలకాయులకు కూడా చాలా సులువుగా కిడ్నీ సర్జరీలను చేయొచ్చు.
రోబో ఒక యంత్రం కాబట్టి దానికి మృదువైన కణజాలమేదో, గట్టిగా ఉన్నదేదో తెలియదు. కానీ, ఇందువల్ల పెద్దగా నష్టాలేమీ ఉండవు. ఇకపోతే ప్రస్తుతం కేవలం ఒకే కంపెనీ రోబో యంత్రాన్ని తయారుచేస్తున్నది. కాబట్టి ఖర్చు ఎక్కువ. ఇలాంటి వాటితో పోలిస్తే రోబోటిక్ సర్జరీతో కలిగే ప్రయోజనాలే ఎక్కువ.
ఓపెన్, లాపరోస్కోపీతో పోలిస్తే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలకు రోబోటిక్ సర్జరీ ఉత్తమమైన పరిష్కారం. అవి…
ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుంది. దీన్ని రాడికల్ ప్రొస్టెక్టమీ అంటారు. లాపరోస్కోపీ ద్వారా ప్రొస్టేట్ను తీసేసినప్పుడు దాని చుట్టుపక్కలున్న చిన్న నాడులు సరిగా కనిపించవు. దీంతో అవి పొరపాటున తెగిపోయేందుకు అవకాశం ఉంది. అందువల్ల వంధ్యత్వం వస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ తొలగిపోయి, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ వాళ్లు ఇంపొటెంట్ కావడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ సమస్య రాకుండా సర్జరీ చేయడం రోబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది.
మూత్రాశయంలో (బ్లాడర్) క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని సర్జరీ ద్వారా తీసేయాల్సి వస్తుంది. ఇలా బ్లాడర్‌ను తొలగించినప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా బ్లాడర్ లాంటి నిర్మాణాన్ని తయారుచేస్తారు. ఈ సర్జరీకి రోబోటిక్స్ బాగా ఉపయోగపడుతుంది. బ్లాడర్‌ను తీసేసిన తర్వాత మూత్రనాళాన్ని పేగుకు కలుపుతారు. కొన్నిసార్లు పేగులోపలే ఒక సంచిలాంటి నిర్మాణాన్ని అమరుస్తారు. ఇది బ్లాడర్ లాగా పనిచేస్తుంది. అయితే, ఇలాంటప్పుడు మూడు నాలుగు గంటలకోసారి పైపు ద్వారా మూత్రాన్ని బయటికి తీయాలి. కొందరికి మూత్రనాళాన్ని పేగుకు కలిపిన తర్వాత శరీరం బయట స్టోమా లాగా సంచిని ఏర్పాటుచేస్తారు. మరో పద్ధతి పేగుతోనే కొత్త బ్లాడర్‌ను తయారుచేయడం. ఇలా తయారుచేసిన బ్లాడర్‌ను మూత్రనాళానికి కలుపుతారు. ఇలాంటి చికిత్సల్లో రోబోటిక్స్ బాగా ఉపయోగపడతాయి.
కొన్నిసార్లు స్త్రీ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు చేసిన గైనిక్ సర్జరీల వల్ల ఫిస్టులా ఏర్పడి దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రోబోటిక్ సర్జరీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకు హిస్టరెక్టమీ, ఫైబ్రాయిడ్స్ లాంటి సర్జరీల తర్వాత బ్లాడర్ డ్యామేజి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బ్లాడర్‌కు, వ్జైనాకు మధ్యలో ఫిస్టులా ఏర్పడవచ్చు. దీన్ని వెసైకో వ్జైనల్ ఫిస్టులా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటుంది. ప్యాడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. రోబో ద్వారా ఫిస్టులాను కత్తిరించి, మిగిలిన భాగాన్ని జాయింట్ చేస్తారు. దాంతో మూత్రం లీక్ సమస్య పోతుంది. యురెటిరో వ్జైనెల్ ఫిస్టులా ఉన్నప్పుడు కూడా ఫిస్టులా కత్తిరించేసి, మూత్రనాళాన్ని మూత్రాశయానికి అటాచ్ చేస్తారు. గైనకాలజికల్ క్యాన్సర్లు ఉన్నప్పుడు, రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా రోబోటిక్ సర్జరీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
పుట్టుకతో మూత్రవిసర్జన వ్యవస్థలో ఏ లోపం ఉన్నా దాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా సరిచేస్తారు. ఈ సమస్యలు పుట్టుకతోనే బయటపడవచ్చు. కొందరిలో పుట్టిన కొన్నాళ్ల తర్వాత బయటపడవచ్చు. మూత్రనాళంలో ఎక్కడ బ్లాక్ ఉన్నా ఈ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలాంటి సర్జరీల్లో పైలోప్లాస్టీ ఒకటి. కొందరిలో పుట్టుకతోనే కిడ్నీ, మూత్రనాళం (యురెటర్) కలిసేచోట బ్లాక్ ఉంటుంది. దీన్ని పెల్విక్ యురేటర్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ సమస్య కొందరిలో పుట్టుకతోనే బయటపడితే, మరికొందరిలో కొన్నాళ్ల తర్వాత బయటపడుతుంది. ఈ బ్లాక్ తీసేయడానికి, బ్లాక్ భాగాన్ని కట్ చేసి, తిరిగి కుట్లు వేస్తారు. దీన్ని పైలోప్లాస్టీ సర్జరీ అంటారు. రోబోటిక్స్ ద్వారా ఈ సర్జరీ సులువు అవుతుంది.
మూత్రనాళం కిడ్నీ నుంచి బయల్దేరి, బ్లాడర్ (మూత్రాశయం)లోకి వెళ్తుంది. ఇలా మూత్ర నాళం బ్లాడర్‌లో ప్రవేశించే చోట బ్లాక్ ఏర్పడితే కిడ్నీ డ్యామేజి అవుతుంది. ఇలాంటప్పుడు కూడా బ్లాక్ ఉన్న మూత్రనాళ భాగాన్ని కత్తిరించివేసి, మిగిలిన భాగాలను తిరిగి కుట్లువేసి అతికిస్తారు.
మూత్రం కిడ్నీలో తయారై మూత్రనాళం ద్వారా బ్లాడర్‌లో ప్రవేశిస్తుంది. అక్కడినుంచి బయటికి వెళ్లిపోవడం సహజమైన ప్రక్రియ. కానీ, కొందరిలో పుట్టుకతో లోపం వల్ల మూత్రం బ్లాడర్ నుంచి బయటికి వెళ్లకుండా తిరిగి వెనక్కి కిడ్నీవైపు వెళ్లిపోతుంది. దీన్ని రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. ఇలాంటప్పుడు మూత్రం కిడ్నీలోకి చేరి, ఇన్ఫెక్షన్ అవుతుంది. క్రమంగా కిడ్నీ దెబ్బతినవచ్చు. ఈ సమస్యకు కూడా
రోబోటిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మంచి పరిష్కారం చూపిస్తుంది.
పెద్ద పెద్ద ట్యూమర్లు ఉంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ మొత్తాన్నీ తీసేయాల్సి వస్తుంది. దీన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటారు. కానీ, చిన్న సైజు ట్యూమర్లు ఉన్నప్పుడు కణితి వరకు మాత్రమే తీసేసి, మిగిలిన కిడ్నీని కాపాడవచ్చు. దీన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారు. ఓపెన్, లాపరోస్కోపీ, రోబోటిక్ సర్జరీలన్నిటి ద్వారా కూడా పార్షియల్ నెఫ్రెక్టమీ చేయొచ్చు. కానీ రోబోటిక్స్ ద్వారా సమర్థంగా చేయవచ్చు. ట్యూమర్ తీసేసేటప్పుడు కిడ్నీని కట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది. ఇది అరగంట కన్నా ఎక్కువ సేపు అయితే కిడ్నీ దెబ్బతింటుంది. లాపరోస్కోపీలో ఇది కష్టం అవుతుంది. అదే రోబో ద్వారా కిడ్నీ కత్తిరించడం, కుట్లు వేయడం తొందరగా అయిపోతాయి. కాబట్టి అధిక రక్తస్రావం ఉండదు. కిడ్నీ దెబ్బతినేందుకు ఆస్కారం ఉండదు.
– డాక్టర్ గుత్త శ్రీనివాస్ సీనియర్ యూరాలజిస్ట్ & రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ, హైదరాబాద్