Heart Attack | సుజాతనగర్, ఏప్రిల్ 6 : ఆకస్మిక గుండెపోటు మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడివయస్సు వరకు పలువురు గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. సడన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని కన్నుమూస్తున్నారు. మృతుల్లో చిన్నారులు మొదలుకొని నడివయస్కులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు తోటి విద్యార్థులతో కలిసి ఆడుకున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యుఒడికి చేరుకుంటున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కొవిడ్ బారినపడిన వారికి రోగనిరోధక శక్తి తగ్గి గుండెపోటుకు కారణమవుతుందని చెప్తున్నారు.
శారీరక వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యపరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. శారీరక శ్రమలేకపోవడంతోపాటు దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వెరసి కిడ్నీ సమస్యలతోపాటు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయంటున్నారు.
శరీర పై భాగం నుంచి ఎడమచేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పి వచ్చేందుకు అది తొలి సంకేతంగా గుర్తించాలి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆయాసం వస్తుంది. యదలో మంట, శరీరంపై చెమటలు, తీవ్రమైన అలసట ఉన్నప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒళ్లు నొప్పులు, ఎసిడిటీ సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలి.
గుండెపోటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యం అందిస్తే మృత్యుఒడి నుంచి తప్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గుండెపోటు మరణాలపై కలతచెందిన సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ ద్వారా సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ ప్రభుత్వశాఖలతోపాటు పలువురికి సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి తక్షణమే ఛాతీపై చేతులతో ఒత్తిడి (సీపీఆర్) కలిగించడం ద్వారా మనిషిని బతికించవచ్చని వైద్యులు చెప్తున్నారు. క్షణాల్లో సీపీఆర్ చేయడం ద్వారా నిలిచిపోయిన రక్తం సరఫరా జరిగి రోగికి స్వస్థత జరుగుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఛాతీలో నొప్పితో కుప్పకూలితో వారి ఛాతీపై చేతులతో బలంగా నొక్కాలి. 30 నుంచి 40 సార్లు ఇలా ప్రెస్సింగ్ చేసిన తర్వాత నోటిలో గట్టిగా గాలిని ఊది శ్వాసను అందించాలి. సీపీఆర్ (కార్డియో పల్మరీ రిసస్బేషర్)పై ప్రభుత్వం పూర్తి అవగాహన కల్పిస్తోంది.
వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న గుండెపోటు నివారణకు ప్రతీ ఒక్కరూ వైద్యులు సూచిస్తున్న ఆరోగ్య సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. ధూమపానం, మద్యం పూర్తిగా మానేయాలి. ప్లాస్టిక్ వినియోగానికి బదులు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్, ఎగ్పప్స్, సమోసా, పానీపూరీతో నిత్యం మరగకాచే చిరుతిండ్లు తినొద్దు. మద్యంతోపాటు అన్ని శీతల పానీయాలు ముప్పును తీసుకొస్తాయి. చికెన్, మటన్‌ను కూడా కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. మాంసప్రియులు చేపలను వినియోగిస్తే మంచిది. ఉప్పు వినియోగం తగ్గించాలి. నిత్యం శారీరక శ్రమ, వ్యాయామం చేస్తే మధుమేహం, ఊబకాయం, రక్తపోటును నియంత్రించవచ్చు. వ్యాయామం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు మరణాల తీవ్రతను పూర్తిగా నివారించవచ్చు.
ఈసీజీ : ఛాతిలో నొప్పి వస్తే తప్పనిసరిగా ఈసీజీ చేయించుకోవాలి. గతంలో ఎప్పుడో వచ్చినా గుండెపోటును ఈ పరీక్షతో గుర్తించవచ్చు.
2డీ ఇకో పరీక్ష : ఇది గుండె స్పందన, గుండె కండరాల్లో వచ్చిన మార్పులు తెలుపుతుంది. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బుకు కారణం అవుతుందా.? లేదా అని తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఎంతో దోహదపడుతుంది.
టీఎంటీ: ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవటం ద్వారా గుండెపై ఒత్తిడి కలిగినప్పుడు చేసే పరీక్ష. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరును తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఎన్జీయోగ్రామ్ : ఈసీజీ, 2డీఇకో పరీక్షల్లో స్పష్టత రాకపోతే గుండెపోటు నిర్ధారణకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.
అధికంగా చక్కెర, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. ఆ సమయంలో గుండెకు ఆక్సీజన్ తగినంత అందకపోవడంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మారిన జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితంలో దొరికిన ఆహారాన్ని గబాగబా తినేస్తున్నారు. ఆహార నియమాలు పూర్తిగా పాటించాలి. శారీరక శ్రమ, వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బరువును నియంత్రించుకోవాలి. ధూమపానం, మద్యపానంతో పాటు మాంసం వినియోగం తగ్గించాలి. నిర్ణీత సమయంలో ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయాలి. వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి.
– డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్, కొత్తగూడెం