కాళ్లను కదపకుండా ఆపుకోలేని పరిస్థితిని వైద్య పరిభాషలో రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోం (ఆర్ఎల్ఎస్)గా పేర్కొంటారు. కాళ్లలో అసౌకర్యంగా అనిపించే సెన్సేషన్స్తోపాటుగా ఈ సమస్య తలెత్తుతుంది. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా సాయంత్రాలు లేదంటే రాత్రివేళల్లో ఈ సెన్సేషన్స్ వస్తుంటాయి. నిద్రలో కూడా తలెత్తవచ్చు. ఇది చికాకు (డిస్ట్రెస్), అలసటకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎల్ఎస్ గురించి తెలుసుకుందాం.
కారణాలు
రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోంకు అసలైన మూలం ఏంటనేది తెలియదు. కాకపోతే కొన్ని కారణాలు దీని అభివృద్ధికి దారితీస్తాయి.
జన్యుపరమైనవి : ఆర్ఎల్ఎస్ కొన్నిసార్లు కుటుంబ చరిత్రలో భాగమైపోతుంది. దీనికి జన్యుపరమైన లంకె ఉంటుందంటున్నారు నిపుణులు.
ఐరన్ లోపం : మెదడులో ఐరన్ స్థాయులు తగినంతగా లేకపోయినా ఈ పరిస్థితి వస్తుందట. అంతేకాదు ఆర్ఎల్ఎస్ లక్షణాలు తీవ్రమవుతాయట.
క్రానిక్ రోగాలు : పార్కిన్సన్స్ డిసీజ్, కిడ్నీల వైఫల్యం, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆర్ఎల్ఎస్తో సంబంధం ఉంటుందట.
మందులు : యాంటిసైకోటిక్స్, యాంటిడిప్రెసంట్స్, యాంటిహిస్టమైన్స్ లాంటి కొన్ని రకాల ఔషధాలు కూడా ఆర్ఎల్ఎస్ లక్షణాలను పెంచుతాయట.
గర్భధారణ : గర్భధారణ సమయంలో తలెత్తే హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా మూడో ట్రైమిస్టర్లో ఆర్ఎల్ఎస్ లక్షణాలు తలెత్తుతాయి. అయితే, ప్రసవం తర్వాత ఇవి వాటంతటవే తగ్గిపోతాయి.
కాళ్లు కదపకుండా నియంత్రించుకోలేక పోవడమే ఆర్ఎల్ఎస్ ప్రాథమిక లక్షణం.
దీనికి అదనంగా…
చికిత్స
లక్షణాలు, రోజువారీ జీవితంపై వాటి ప్రభావం ఆధారంగా ఆర్ఎల్ఎస్ చికిత్స ఆధారపడి ఉంటుంది.
జీవనశైలి మార్పులు: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన నిద్ర, కెఫీన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం లాంటివి ఆర్ఎల్ఎస్
లక్షణాలను తగ్గిస్తాయి.
ఐరన్ సప్లిమెంట్స్: ఐరన్ లోపం వల్ల ఆర్ఎల్ఎస్ తలెత్తుతుంది కాబట్టి, డాక్టర్లు ఐరన్ సప్లిమెంట్లు సిఫారసు చేస్తారు.
మందులు: కొన్ని కేసులలో, డోపమైన్ స్థాయులను ప్రభావితం చేసే యాంటికన్వల్సెంట్లు లేదా ఒపియాయిడ్స్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది.
ఆర్ఎల్ఎస్ లక్షణాలు మామూలుగా ఉంటే కొన్ని ఇంటిచిట్కాలు ఫలితాలను ఇస్తాయి.
వేడినీటితో స్నానం: నిద్రకు ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అయిపోతాయి. దీంతో సమస్య కొంచెం తగ్గిపోతుంది.
కాళ్ల మసాజ్: కాళ్లను నెమ్మదిగా మసాజ్ చేసినా అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేడి/ చల్లటి ప్యాక్: కాళ్లపై వేడి లేదంటే చల్లటి ప్యాక్‌ను అప్లయ్ చేయడం కూడా మంచిదే.
వ్యాయామం: తేలికపాటి నుంచి ఓ మోస్తరు క్రమం తప్పని వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, నిద్రకు ముందు తీవ్రమైన వ్యాయామాలు మాత్రం మంచివి కాదు.
మంచినిద్ర: రోజూ నియమిత వేళల్లోనే పడుకోవడం, నిద్రించే దగ్గర ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.