కాలం మారుతున్నది. జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దాదాపు అన్ని పనులూ టెక్నాలజీ సాయంతోనే జరిగిపోతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఈ ధోరణి ఊబకాయానికి దారితీస్తున్నది. బరువు పెరిగేకొద్దీ జీవితం బరువుగా మారిపోతుంది. అయినా, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదమూ ఉంది. బేరియాట్రిక్ సర్జరీలాంటి విధానాలతో ఊబకాయ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎవరికి చేయవచ్చు?
బేరియాట్రిక్ సర్జరీ.. బరువును నియంత్రించే శస్త్రచికిత్స. ఇది ‘బ్యారోస్’ (బరువు) అనే పదం నుంచి వచ్చింది. అయితే, ఈ సర్జరీకి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. 40 బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్)కంటే ఎక్కువ బరువు ఉన్నా.. లేదా 35 బీఎంఐ కంటే ఎక్కువ ఉండి.. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊపిరితిత్తులపై ఒత్తిడి (అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా) తదితర సమస్యలతో బాధపడుతున్నా.. బేరియాట్రిక్ సర్జరీ చేయాలని ఓ నియమం. గత ఏడాది ఈ మార్గదర్శకాలకు కొన్ని మార్పులు చేశారు. ఆ ప్రకారం.. బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉన్నా.. బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉండి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. బేరియాట్రిక్ సర్జరీ చేయవచ్చు. భారతీయుల విషయానికొస్తే.. బీఎంఐ 27 కంటే ఎక్కువ ఉంటూ.. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా ఈ సర్జరీకి వెళ్లవచ్చు.
బీఎంఐ ప్రకారం..
జాగ్రత్తలు
నిర్ధారణ పద్ధతులు
ఒక వ్యక్తి అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్న విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. అందరికీ తెలిసిన బీఎంఐ. రెండోది.. వెయిస్ట్ హిప్ రేషియో (నడుము/తుంటి నిష్పత్తి). ఈ నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే తక్కువ ఉండాలి. పురుషుల్లో 1 కంటే తక్కువ ఉండాలి. అనంతరం రక్తపరీక్షలు, ఊపిరితిత్తులు, గుండె పరీక్షల ద్వారా ఏ అవయవంపై ఎంత ఒత్తిడి పడుతుందో తెలుసుకోవచ్చు.
చికిత్సా విధానాలు
అధిక బరువుకు రెండురకాల ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సర్జికల్ పద్ధతి. దీన్నే బేరియాట్రిక్ సర్జరీ అంటారు. రెండోది.. ఎండోస్కోపిక్ పద్ధతి. బేరియాట్రిక్ పద్ధతిలో న్యూరో హార్మోనల్ సైకిల్‌ను నియంత్రించడంతో పాటు శరీరంలోని ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించి, ఇన్సులిన్ ఊటను బాగా పెంచుతారు. ఫలితంగా జీవక్రియ వేగవంతమై, కొవ్వు కరిగిపోతుంది. బేరియాట్రిక్ సర్జరీకి పెద్దగా సమయం పట్టదు. మొత్తం శస్త్రచికిత్స గంటన్నర నుంచి రెండు గంటల్లో పూర్తవుతుంది. రోగిని నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన 10 రోజుల తరువాత రోగులు సాధారణ జీవనాన్ని గడపవచ్చు.
ఎండోస్కోపిక్ పద్ధతి
ఇది కూడా సురక్షితమైన విధానమే. కాకపోతే, 27-30 బీఎంఐ ఉన్నవారికే ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేస్తారు. ఇందులో మళ్లీ రెండురకాలు. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్
ఈ పద్ధతిలో రోగి పొట్టలోకి స్లైన్ నింపిన సిలికాన్ బెలూన్ పంపుతారు. దాదాపు ఆరు నెలల తర్వాత.. దాన్ని ఎండోస్కోపీ పద్ధతిలో తొలగిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ తర్వాత మరో బెలూన్ పంపాలా లేదా అనేది నిర్ణయిస్తారు.
బేరియాట్రిక్ సర్జరీతో ఉపయోగాలు
ఎండోస్లీవ్
ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ.. పద్ధతిలో రోగి పొట్ట సైజును తగ్గిస్తారు. దీంతో, ఇట్టే పొట్ట నిండిపోతుంది. తక్కువ ఆహారం తీసుకుంటారు. ఈ రెండు పద్ధతుల్లోనూ ఇన్‌పేషెంట్‌గా ఉండాల్సిన అవసరం రాదు. దాదాపుగా అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. తొలుత కొంత అసౌకర్యంగా అనిపించినా.. వెంటనే సర్దు కుంటుంది. ఈ విధానాల్లో తీవ్ర దుష్ఫలితాలు ఉండవు. అన్నిటికీ మించి ఊబకాయం వల్ల వచ్చే ప్రాణాపాయం తప్పుతుంది.
– డాక్టర్ కోన లక్ష్మీ కుమారి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బేరియాట్రిక్ సర్జన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ
…?మహేశ్వర్‌రావు బండారి