Reheating Foods | ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అందరూ జంక్ ఫుడ్ తినేందుకు అలవాటు పడ్డారు. ఇండ్లలో వంట చేసుకుని తినే సమయమే చాలా మందికి లభించడం లేదు. ఇక కొందరు ఇంట్లో కేవలం అన్నం మాత్రమే వండుకుని బయట కూరలను కొని తెచ్చి తింటున్నారు. అందుకనే కర్రీ పాయింట్లు కూడా బోలెడన్ని వెలుస్తున్నాయి. ఇక చాలా మంది ఆహారాన్ని ఒకసారి వండిన తరువాత దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటుంటారు. తాజాగా వండిన ఆహారాన్ని చాలా మంది తినరు. ఉదయం చేసింది మిగిలిపోయిందని మధ్యాహ్నం తింటారు. మధ్యాహ్నం వండింది మిగులుతుందని రాత్రి తింటారు. మళ్లీ రాత్రి వండింది ఉదయం తింటారు. ఇలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని అసలు తినరు. అయితే ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది జీవన విధానం మారిపోయింది. తాజాగా వండుకుని తినే సమయం లభించడం లేదు. దీంతో ఒకసారి వండిన ఆహారాలనే మరోమారు వేడి చేసి తింటున్నారు. అలాగే వేపుళ్లకు వాడిన నూనెను ఇతర పదార్థాల తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. కూరలు, మాంసాహారం వంటివి మిగిలిపోతే ఫ్రిజ్‌లో పెట్టి వాటిని మరుసటి రోజు వేడి చేసుకుని తింటున్నారు. ఇలా చాలా మంది జీవనశైలి మారిపోయింది. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగలు లేదా ఇంట్లో ఇతర సమయాల్లో కొన్ని సార్లు పిండి వంటలు చేస్తుంటారు. ఇందుకు గాను పెద్ద కడాయిని కూడా పెడతారు. దాని నిండా నూనెను పోసి దాంతో రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు.
అయితే అలా మిగిలిపోయిన నూనెను వేడి చేస్తే అందులో విష పదార్థాలు తయారవుతాయి. ఈ నూనెతో తయారు చేసే పదార్థాలను తింటే గుండె జబ్బులు వస్తాయి. నాడీ మండల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చాలా వరకు రహదారుల పక్కన బండ్లపై లేదా రెస్టారెంట్లు, హోటల్స్‌లో అమ్మే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు, బజ్జీలు వంటి పదార్థాలను తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. పదే పదే వేడి చేసిన నూనెను ఉపయోగించి చాలా మంది వీటిని తయారు చేస్తారు. అలాంటి పదార్థాలను తింటే స్వయంగా రోగాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్ ఆయిల్స్‌ను పదే పదే వేడి చేసి ఉపయోగించకూడదు. అలాగే నెయ్యి, డాల్డా, కొబ్బరినూనె, పల్లి నూనె వంటి నూనెలను రెండోసారి వేడి చేసినా వాటి స్వభావంలో పెద్దగా మార్పు రాదు. కనుక వీటిని రెండోసారి వేడి చేసి వాడవచ్చు. ఆ తరువాత వాడకూడదు.
ఏవైనా వంటకాలను చేసేటప్పుడు సాధారణంగా చిన్న కడాయిని ఉపయోగించాలి. దీంతో నూనె తక్కువగా పడుతుంది. నూనె వృథా కాకుండా అరికట్టవచ్చు. ఇక చాలా మంది ఇండ్లలో రోజూ ఎంత కొంత అన్నం మిగులుతుంది. దాన్ని కాస్త వేడి చేసి తింటారు. కానీ వేడి చేస్తే సరిగ్గా వేడి చేయాలి. కొద్దిగా నీళ్లను చల్లి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. దీంతో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది. అన్నాన్ని ఇలా వేడి చేసి ఒకసారి తినవచ్చు. అలాగే ఆహారాన్ని వీలైనంత వరకు వేడిగా ఉన్నప్పుడే తినాలి. అలా అయితేనే మనకు పోషకాలు లభిస్తాయి. ఆలస్యం చేసే కొద్దీ అందులో ఉండే పోషక విలువలు నశిస్తాయి. బ్యాక్టీరియా కూడా చేరుతుంది. అలాంటి ఆహారాన్ని తింటే రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇలా ఆహారాలను వేడి చేసి తినే విషయంలో జాగ్రత్తలను పాటించడం అవసరం.