Red Vs White Onions | ఉల్లిపాయలు లేకుండా అసలు ఎవరూ వంట చేయరు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ చేసే కూరల్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తింటుంటారు. మజ్జిగతో రైతా వంటివి చేస్తే పచ్చి ఉల్లిపాయలను కట్ చేసి వేస్తారు. ఇంకా అనేక విధాలుగా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. అయితే మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఒకటి ఎర్ర ఉల్లిపాయలు కాగా రెండు తెల్ల ఉల్లిపాయలు. చాలా మంది రెండు రకాల ఉల్లిపాయలను వాడుతుంటారు. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి..? వేటిని వాడితే మనకు మిక్కిలి ప్రయోజనం కలుగుతుంది..? అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. దీనికి పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర ఉల్లిపాయల్లో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్లే ఉల్లిపాయలకు ఎరుపు రంగు వస్తుంది. ఆంథోసయనిన్స్ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, ఎరుపు రంగు క్యాబేజీ, ఎరుపు రంగులో ఉండే ఇతర కూరగాయలు, పండ్లలోనూ ఉంటాయి. ఆంథో సయనిన్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఎరుపు రంగు ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెకు ఎక్కువగా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తెలుపు రంగు ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. తెల్ల రంగు ఉల్లిపాయలను తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అయితే ఈ రెండు ఉల్లిపాయలు వేటికవే ప్రత్యేకమైనవి. నిర్దిష్టంగా ఒకే రకానికి చెందిన ఉల్లిపాయలను తినాలని చెప్పలేమని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే రెండు రకాల ఉల్లిపాయలను తినాల్సిందేనని వారు అంటున్నారు. అందుబాటులో ఉన్న రకాన్ని బట్టి తినవచ్చని వారు సూచిస్తున్నారు.
ఉల్లిపాయలను పచ్చిగా తింటే అనేక పోషకాలను పొందవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఏ రకం ఉల్లిపాయలు అయినా సరే ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ పచ్చిగా తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అనేక రకాల బి విటమిన్లు కూడా ఉల్లిపాయల్లో ఉంటాయి. కనుక ఎరుపు లేదా తెలుపు ఎవరికి ఇష్టం వచ్చిన రంగులో ఉన్న ఉల్లిపాయలను అయినా సరే తినవచ్చు. రెండింటి వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి.