Ragi Java | రాగి జావను తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగి జావ శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకనే రాగి జావను వేసవిలో తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే వేసవి ముగియగానే రాగి జావను తాగడం మానేస్తారు. కానీ దీన్ని సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా తాగవచ్చు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాగి జావను వర్షాకాలంలో కచ్చితంగా తాగాలని వారు అంటున్నారు. వర్షాకాలంలోనూ రాగి జావను తాగితే అనేక లాభాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. గాలిలో ఉండే తేమ కారణంగా మన మెటబాలిజం తగ్గుతుంది. కానీ ఈ సమయంలో రాగి జావను తాగడం ఎంతో మేలు చేస్తుంది. రాగి జావను తాగితే సులభంగా జీర్ణం అవడమే కాదు జీర్ణ వ్యవస్థ పనితీరును సరిచేస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
వర్షాకాలంలో విరేచనాల సమస్య చాలా మందికి వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే రాగి జావను తాగితే జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు నశిస్తాయి. డయేరియాకు కారణం అయ్యే క్రిములు నాశనం అవుతాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. వర్షాకాంలో చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. చిన్నారులు అయితే తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. కానీ రాగి జావను తాగుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రాగుల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక వర్షాకాలంలోనూ కచ్చితంగా రాగి జావను తాగాల్సి ఉంటుంది.
రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి, ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు ఉన్నవారు రాగి జావను తాగుతుంటే అవి త్వరగా అతుక్కుంటాయి. రాగుల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రాగుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కనుక రాగి జావను తాగితే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గేందుకు దోహదం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా రాగి జావను తాగుతుండాలి.
రాగి జావను తయారు చేయడం చాలా తేలికే. చాలా మంది రాగులతో పిండి చేసి దాంతో రాగి జావను తయారు చేస్తారు. కానీ రాగులను మొలకెత్తించి ఎండబెట్టాలి. అనంతరం వాటిని పిండిలా మార్చాలి. అప్పుడు దాంతో రాగి జావను తయారు చేయాలి. ఇలా రాగులను మొలకెత్తించి వాటితో రాగి జావను తయారు చేసి తాగితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి. రాగి జావలో మజ్జిగ లేదా పెరుగు కలిపి తాగవచ్చు. దీన్ని రోజూ ఉదయం తాగితే మంచిది. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. ఈ విధంగా రాగి జావను తయారు చేసి తాగుతుంటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.