Radish Leaves Benefits | ముల్లంగి పేరు చెబితేనే చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. ఎందుకంటే ముల్లంగి రుచికి చాలా ఘాటుగా ఉంటుంది. వాసనగా కూడా ఉంటుంది. కను ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. అయితే ముల్లంగిని తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ముల్లంగిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని కూరలు, సలాడ్లు, పరాటాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ముల్లంగితో చేసే వంటలు రుచిగానే ఉంటాయి. కానీ చాలా మంది దీన్ని తినరు. అయితే ముల్లంగి మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పబోయే లాభాలు తెలిస్తే ఇకపై ఎప్పుడూ ముల్లంగి ఆకులను మీరు పడేయరు. ముల్లంగి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ముల్లంగి ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, సి, కె ఉంటాయి. అలాగే క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ముల్లంగి ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముల్లంగి ఆకులు సహజసిద్ధమైన డిటాక్సిఫయర్లుగా పనిచేస్తాయి. అంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయన్నమాట. ముఖ్యంగా లివర్, కిడ్నీల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో ఆయా అవయవాల పనితీరు మెరుగు పడుతుంది.
ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముల్లంగి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో చర్మం డ్యామేజ్ అవకుండా కాపాడుకోవచ్చు. అలాగే ముఖంలో కాంతి పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే విటమిన్ ఎ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. దీంతో చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది. ముల్లంగి ఆకుల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ముల్లంగి ఆకులు వరమనే చెప్పవచ్చు. ఈ ఆకులతో షుగర్ అదుపులో ఉంటుంది.
ముల్లంగి ఆకుల్లో శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. చలికాలంలో వచ్చే నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ముల్లంగి ఆకులను మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. వీటితో పరాటాలను తయారు చేసి తినవచ్చు. లేదా సూప్ తయారు చేసుకోవచ్చు. పప్పులోనూ ముల్లంగి ఆకులను పెట్టుకోవచ్చు. కూరగా చేసుకుని తినవచ్చు. ఎలా తిన్నా కూడా ముల్లంగి ఆకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.