Quit Smoking | పొగ తాగడం వల్ల ఎవరికైనా ఎంతటి దుష్ఫలితాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. రక్తం నాణ్యత తగ్గిపోతుంది. గుండెకు ఎఫెక్ట్ అవుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇవే కాదు, పొగతాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అది శరీరంలోని ఏ భాగానికైనా ఎఫెక్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా మంది పొగతాగడం మానేయాలని అనుకుంటారు. కానీ మానలేకపోతారు. ఇంకా కొందరు పొగ తాగడం మానేస్తారు. కానీ వారికి పలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో పొగ తాగడం మానేయలేకపోతున్న వారే కాదు, మానేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు వివరిస్తున్నారు. వాటిని పాటిస్తే పొగ తాగడం సులభంగా మానేయడమే కాదు, ఆ తరువాత కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
పొగ తాగడం మానేయలేక పోతున్నవారు ముందుగా చేయాల్సిన పని వైద్యుడి దగ్గరికి వెళ్లడం. వైద్యుడి దగ్గరికి వెళ్లి స్మోకింగ్ మానేయడం గురించి, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా తెలుసుకోవాలి. అనంతరం ఈ స్టెప్స్ పాటించాలి. దీన్నే స్టార్ట్ (START) మెథడ్ అని కూడా అంటారు. S= Set a quit date. ( మీరు పొగ తాగడం ఎప్పటి నుంచి మానేస్తున్నారో ఆ తేదీని ముందుగా నిర్ణయించుకోవాలి). T= Tell friends and family members that you plan on quitting. (మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీరు పొగ తాగడం మానేస్తున్నట్టు చెప్పాలి). A= Anticipate hard times ahead and plan for them. (పొగ తాగడం మానేయాల్సిన తేదీ వస్తుంటే గాభరా పడకూడదు. అందుకోసం మానసికంగా సిద్ధంగా ఉండాలి. అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి). R= Remove tobacco products from the house, car, and work. (ఇల్లు, కారు, ఆఫీస్ లాంటి ప్రదేశాల్లో మీరు పెట్టుకునే పొగాకు ఉత్పత్తులను అన్నింటినీ తీసేయాలి). T= Tell you Doctor so that you can get help. (డాక్టర్‌ను సంప్రదించాలి. స్మోకింగ్ మానేయాలనుకుంటున్నానని చెప్పి అతని సలహా తీసుకోవాలి).
మానసిక వైద్యున్ని సంప్రదించాలి. స్మోకింగ్ మానేస్తున్నానని చెప్పి అందుకు తగిన విధంగా సన్నద్ధులు అవడం కోసం ఆ వైద్యుల నుంచి కౌన్సిలింగ్ తీసుకోవాలి. అవసరం అయితే గ్రూప్ కౌన్సిలింగ్ వంటి వాటిలోనూ పాల్గొనాలి. స్మార్ట్‌ఫోన్ యూజర్లైతే వారికి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లలో స్మోకింగ్‌ను మానేసేందుకు ఉపయోగపడే కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించాలి. పొగతాగడం మానేసేందుకు వైద్యులు కొన్ని మందులను సూచిస్తారు. వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. నికోటిన్ ప్యాచ్, నికోటిన్ గమ్, నికోటిన్ బిళ్లలు, ఇన్హేలర్స్, నాసల్ స్ప్రేలు మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించాలి. పొగ తాగడం మానేయడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో వాటి గురించే ఎల్లప్పుడూ ఆలోచించాలి.

స్మోకింగ్ మానేసిన వ్యక్తుల్లో కొద్ది రోజులకే బీపీ అదుపులోకి వస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. పొగ తాగడం మానేసిన వారు శ్వాస సమస్యతో సతమతమవుతుంటారు. ఇందుకోసం నిత్యం శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో నేలపై కూర్చుని ఊపిరిని నెమ్మదిగా పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఒక సారి ముక్కుతో పీలుస్తూ మరో సారి నోటితో వదలాలి. మళ్లీ నోటితో పీల్చి ముక్కుతో వదలాలి. ముక్కు రంధ్రాల్లో ఒక దాన్ని మూసి, మరో దాన్ని తెరచి శ్వాస పీలుస్తూ వదలాలి. దీంతో శ్వాస సమస్యలు పోతాయి.
స్మోకింగ్ మానేశాక కొందరికి దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. అయితే దాని గురించి బెంగ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మ్యూకస్ బయటికి వెళ్తూ అలా దగ్గు వస్తుంది. అయితే దగ్గు తక్కువగా వస్తుంటే భయపడాల్సిన పనిలేదు. కానీ అదే దగ్గు ఎక్కువ రోజుల పాటు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. స్మోకింగ్ మానేసిన వారి ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది. అలాంటి వారు తమ తమ ఇండ్లలో హ్యుమిడిఫైర్ వంటి పరికరాలను పెట్టుకుంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది. దీంతో శ్వాస సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి వారు నిత్యం నీటిని ఎక్కువగా తాగుతుంటే మ్యూకస్ సమస్య తొలగిపోతుంది. రోజుకు 30 నిమిషాల పాటు వారానికి కనీసం 5 రోజులు వరుసగా వ్యాయామం చేయాలి. ఇలా వారానికి కనీసం 150 నిమిషాల వరకు శరీరానికి వ్యాయామం అవసరం.
వాకింగ్, నెమ్మదిగా సైకిల్ తొక్కడం, తోటపని, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తే స్మోకింగ్ మానేయడం వల్ల కలిగే ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం, చేపలు వంటి ఆహారాన్ని తరచూ తీసుకుంటే దాంతో పోషకాలు శరీరానికి సరిగ్గా అంది తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. పొగ తాగడం మానేశాక చాలా రోజుల వరకు కూడా మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గకపోతే సరైన వైద్య సలహా పాటించాల్సి ఉంటుంది.