Proteins Deficiency Symptoms | మన శరీరానికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు రెండూ అవసరం అన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రోటీన్లు స్థూల పోషకాల కిందకు వస్తాయి. అంటే ప్రోటీన్లను మనం నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలన్నమాట. ప్రోటీన్లు మన శరరీంలో అనేక విధులను నిర్వహిస్తాయి. ప్రోటీన్ల వల్ల జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. అలాగే కండరాలు అభివృద్ధి చెందుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. అయితే కొందరు నిత్యం కార్బొహైడ్రేట్లు లేదా కొవ్వులను అధికంగా తింటుంటారు. ప్రోటీన్లను సరిగ్గా తీసుకోరు. దీంతో ప్రోటీన్ల లోపం ఏర్పడుతుంది. ఇది వస్తే ప్రమాదంలో పడినట్లే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక ప్రోటీన్ల లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అయితే మన శరీరానికి ప్రోటీన్లు సరిగ్గా లభించకపోతే అప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది. అవేమిటంటే..
ప్రోటీన్లను సరిగ్గా తీసుకోకపోతే మన శరీరంలోని కండరాలకు శక్తి సరిగ్గా లభించదు. దీంతో కండరాలు బలహీనంగా మారి నొప్పి వస్తాయి. రోజూ మీరు చేసే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతుంటారు. కండరాలను టచ్ చేస్తే చాలు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్ల లోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రోటీన్ల లోపం జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రోటీన్ల లోపం ఉంటే జుట్టుకు పోషణ లభించదు. దీంతో జుట్టు పలుచగా మారుతుంది. బలహీనమవుతుంది. జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. జుట్టు కుదుళ్లు కూడా బలహీనంగా మారి జుట్టు రాలుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నా కూడా ప్రోటీన్ల లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
మన శరీర రోగ నిరోధక వ్యవస్థ సాఫీగా పనిచేయాలంటే అందుకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే దాని ప్రభావం రోగ నిరోధక వ్యవస్థపై కూడా పడుతుంది. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫలితంగా తరచూ దగ్గు, జలుబు, ఫ్లూ బారిన పడుతుంటారు. లేదా ఈ వ్యాధులు వస్తే ఒక పట్టాన తగ్గవు. నెలల తరబడి అలాగే ఉంటాయి. ఈ లక్షణాలు కూడా ప్రోటీన్ లోపాన్ని తెలియజేస్తాయి. అలాగే ప్రోటీన్ల లోపం ఉంటే శరీరానికి శక్తి సరిగ్గా లభించక తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చిన్న పని చేసినా కూడా విపరీతంగా అలసిపోతారు. మెట్లు ఎక్కలేకపోతుంటారు. ఆయాసం వస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తుంది. బలహీనంగా మారిపోతారు. ఇవన్నీ ప్రోటీన్ల లోపం ఉందని చెప్పే లక్షణాలే.
ప్రోటీన్ల లోపం ఉంటే ఉన్నట్లుండి సడెన్ గా బరువు పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు బరువును తగ్గించుకోలేకపోతుంటారు. అలాగే పాదాలు, అర చేతులతోపాటు శరీరంలోని ఇతర భాగాల్లోనూ వాపులు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో నొక్కితే సొట్టపడి చర్మం లోపలికి పోతుంది. ఆయా భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. నొప్పిని భరించలేకపోతుంటారు. ప్రోటీన్ల లోపం కారణంగా శరీరంలో ద్రవాల అసమతుల్యత ఏర్పడి అలా జరుగుతుంది. కనుక ఈ లక్షణాలను కూడా ప్రోటీన్ల లోపంగానే భావించాలి. ప్రోటీన్ల లోపం ఉంటే గోర్లకు సరిగ్గా పోషకాలు లభించవు. దీంతో గోర్లు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి. గోర్లు పలుచగా మారిపోతాయి. అలాగే కొందరి గోర్లు రంగు కూడా మారుతాయి. ఇలా పలు లక్షణాలను బట్టి ప్రోటీన్ల లోపం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ వద్దకు వెళితే సరైన చికిత్స అందిస్తారు. ప్రోటీన్ల లోపం పోవాలంటే ప్రోటీన్లు ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది.