వర్షకాలం వచ్చిందంటే చాలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతుంటాయి. అయితే, ఇతర జ్వరాలకంటే డెంగీ పేరు వినగానే ఆందోళన ఎక్కువగా కలుగుతుంది. నిజానికి డెంగీ సాధారణ సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్‌తోనే నయమవుతుంది. కానీ, చికిత్స సకాలంలో అందించాల్సి ఉంటుంది. ఇకపోతే పిల్లలు, పెద్దలకు డెంగీ వస్తేనే తెగ భయపడిపోతాం. అలాంటిది గర్భిణులకు వస్తే పరిస్థితి ఏంటనేది మరింత కంగారుపెట్టే అంశం. డెంగీ బారినపడ్డప్పుడు గర్భిణులు సాధారణ రోగుల్లా ఏవో కొన్ని మందులు వాడటానికి వీలుండదు. పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి. పైగా గర్భిణులకు డెంగీ సోకితే అది తల్లీ బిడ్డలు ఇద్దరికీ కొంచెం ప్రమాదకరమే. కాబట్టి, గర్భిణులకు డెంగీ జ్వరం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, చికిత్స ఎలా తీసుకోవాలో అవగాహన ఉంటే మంచిది.
Dengue | వానాకాలంలో సీజనల్ వ్యాధులతోపాటు డెంగీ, మలేరియా, డయేరియా తదితర రోగాలు జనాలను చుట్టేస్తుంటాయి. ప్రతి ఇంటినీ ఏదో ఒక సీజనల్ వ్యాధి పలకరిస్తుంది. వాస్తవానికి డెంగీ, డయేరియా మినహా ఇతర సీజనల్ వ్యాధులు అంత ప్రమాదకరం కాదు. డెంగీ, డయేరియా కూడా సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే సాధారణ జ్వరాల్లానే తగ్గిపోతాయి. వీటికి ప్రత్యేక చికిత్స అంటూ ఏదీలేదు. డాక్టర్లను సంప్రదిస్తే వారు సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తారు. కాకపోతే ఇది సాధారణ రోగుల విషయంలో మాత్రమే వర్తిస్తుంది. గర్భిణులకు మామూలు చికిత్స పనికిరాదు. డెంగీ, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వీటిని ప్రారంభ దశలో గుర్తిస్తే సాధారణ చికిత్సతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే అది తల్లీ బిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరమే.
మహిళలు గర్భం దాల్చడంతో వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గిపోతుంది. దీనివల్ల వీరికి ఇన్ఫెక్షన్స్, సీజనల్ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువ. అందుకే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. వర్షకాలంలో ఎక్కువగా దోమల కారణంగా డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు వస్తుంటాయి. కాబట్టి, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికితోడు వానలో తడవకుండా, చల్లటి వాతావరణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
గర్భిణులపై డెంగీ, డయేరియా, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరం. డెంగీ వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్రసవం సమయంలో ఇది చాలా ప్రమాదకరం. కామెర్లు వస్తే అవి బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధుల వల్ల తీవ్రజ్వరం, వాంతులు, విరేచనాలు అవుతాయి. దీనివల్ల రోగి డీ-హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కడుపులో బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఏ అనారోగ్య సమస్య వచ్చినా గర్భిణులు మందులను ఎలా పడితే అలా వాడకూడదు. ముఖ్యంగా యాంటిబయాటిక్స్ కడుపులో ఉన్న బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. వారి సూచనల మేరకే మందులు వాడాలి. ఎందుకంటే వాడే మందులు కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల వేళ డాక్టర్ల సలహా తప్పనిసరి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గర్భిణులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల రక్షణ లభిస్తుంది. సాధారణంగా 4వ నెలలో ఉన్నప్పుడు ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) టీకా ఇస్తారు. గర్భధారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని డెంగీ వంటి జ్వరాల ముప్పు నుంచి రక్షించుకోవాలి. డాక్టర్ల సలహాలను తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే తల్లికే కాకుండా కడుపులో ఉన్న శిశువుకూ ఆరోగ్యాన్ని ప్రసాదించిన వాళ్లమవుతాం.
మూడు నెలల్లోపు గర్భిణులు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే ఎలాంటి ముప్పు ఉండదు. నిర్లక్ష్యం చేస్తే అబార్షన్ ప్రమాదం పొంచి ఉంటుంది. గర్భం ధరించిన తొలిదశలో… అంటే మూడు నెలల్లోపు హై ఫీవర్, విరేచనాలు ఎక్కువగా జరిగితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువ. గర్భిణుల్లో తీవ్రమైన జ్వరం లేదా విరేచనాలు, వాంతులు వంటివి అధికంగా జరిగితే అది తల్లికి కూడా ప్రమాదకరమే. ఇలాంటప్పడు రోగి డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా చికిత్స అందించాలి. ఇక హైఫీవర్ను క్రమపద్ధతిలో తగ్గిస్తారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స క్లిష్టంగా మారుతుంది.