Back Pain | నమస్తే మేడం. నా వయసు 37 సంవత్సరాలు. తొలిసారి గర్భం ధరించాను. సహజ గర్భమే. నెల తప్పి 20 రోజులు అయింది. అయితే బాగా నడుము నొప్పి వస్తున్నది. తొలి రోజుల్లో ఇలా జరగడం సహజమేనా. ఇలా నొప్పి ఎందుకు వస్తుంది. తొమ్మిది నెలలూ ఉంటుందా?
సాధారణంగా నెల తప్పగానే నడుము నొప్పి రావడం జరగదు. మీ విషయంలో ఇలా ఎందుకు అయింది అన్నదానికి కొన్ని పరీక్షలు చేస్తే తప్ప తేల్చలేం. ఇందుకోసం మంచి గైనకాలజిస్టుని సంప్రదించండి. బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓఎస్లాంటి వాటికి సంబంధించిన పరీక్షలు చేస్తారు. అలాగే ఆస్టియోపోరోసిస్ ఏమైనా ఉందా నిర్ధారించుకోవాలి.
37 సంవత్సరాలకు తొలి గర్భం అంటున్నారు. ఎందుకు ఆలస్యం అయింది, ఇంతకు ముందు ఏమైనా మందులు వాడారా అన్నది తెలియాలి. బరువు ఎక్కువగా ఉన్నారా, ఎత్తుకు సరిపడా ఉన్నారా అన్నదీ చూసుకోవాలి. వీటి ఫలితాల ఆధారంగా మీ నొప్పికి కారణాలు తెలియవచ్చు. ఈ సమయంలో మీరు నొప్పి మాత్రలు మాత్రం వేసుకోకూడదు. అలాగే గర్భం ఆలస్యం అయింది కాబట్టి, పిండం ఆరోగ్యం గురించి తెలుసుకునేందు జెనెటిక్ టెస్ట్ అని చేస్తారు. అది చేయించుకోండి. ఇక, మీ నొప్పి గర్భధారణ సమయం అంతా ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్