నెల తప్పిన తర్వాత నుంచి బిడ్డ భూమి మీద కొచ్చేదాకా పొంచి ఉండే గండాలెన్నో. తల్లిగర్భం నుంచి భద్రంగా శిశువు బయటికి రావడం వెనుక ఆమె ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. షుగర్, బీపీలాంటి వ్యాధులతో పాటు ఇతర సమస్యలెన్నో బిడ్డ ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అయిదో నెల నిండిన తర్వాత కూడా గర్భస్థ శిశువుకు పొంచి ఉండే ప్రమాదాలు చాలానే ఉంటాయి. వాటి పట్ల అవగాహన పెంచుకోవడం, వైద్యుల అవసరాన్ని అర్థం చేసుకోవడం వల్ల బిడ్డను కాపాడుకోవడం సులభం అవుతుంది.
ఇరవై వారాలు నిండిన తర్వాత కూడా గర్భస్థ శిశువు చనిపోవడానికి ఆప్లా సిండ్రోమ్‌ను ఒక కారణంగా చెప్పవచ్చు. దీన్నే యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటీ బాడీ సిండ్రోమ్ అంటారు. ఇందులో తల్లి శరీరంలోని కణాలు ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటాయి. దీని వల్ల శరీరంలో రక్తం గూడు కట్టుకుపోతుంది. మాయ పని చేయదు. దీంతో మాయ ద్వారా బిడ్డకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందక అది చనిపోతుంది. ఇలా రక్తం గడ్డ కడుతుండటం వల్ల తల్లికి రక్తపోటు పెరుగుతుంది. బీపీ పెరిగినా మాయ పనిచేయడం మానేస్తుంది. దాంతోపాటు ఆప్లా కారణంగా ముందుగానే ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అది కూడా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం కలిగించేదే.
కొన్నిసార్లు బిడ్డ ఎదుగుదలలో ఏర్పడే అవకరాలు కూడా గర్భస్రావానికి కారణం అవుతాయి. ఇరవై వారాల దాకా బిడ్డ ఎదిగినా గుండె ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, మెదడులో నీరు చేరడంలాంటివి ప్రాణాల మీదకు తెచ్చిపెడతాయి. జన్యులోపాలు దీనికి కారణం కావచ్చు.
మరికొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి శిశువుకు ఆయువు పట్టు అయిన మాయ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. దీనికి ప్రత్యేక కారణాలు ఏమీ కనిపించక పోవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్గా పిలుస్తారు. దీనివల్ల కూడా కడుపులోని బిడ్డ చనిపోతుంది.
ఆర్ఎస్ ఇన్‌కంపాటిబిలిటీ అనేది కూడా వీటిలో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రీసస్గా పిలిచే ప్రత్యేక బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంది. తల్లి రీసస్ నెగెటివ్ ఉండి తండ్రి పాజిటివ్ అయితే బిడ్డ కూడా పాజిటివ్ వస్తుంది. అయితే కడుపులో పిండం తయారయ్యే దశలో బిడ్డలోని రక్త కణాలు కొన్ని లీకవుతుంటాయి. అలా పాజిటివ్ ఉన్నవి తల్లి శరీరంలోకి రావడం అన్నది తల్లికి పడదు. దీంతో కొన్ని నిరోధక కణాలు శరీరంలో పుడతాయి. అవి మాయ ద్వారా బిడ్డలోకీ ప్రవేశించవచ్చు. అలాంటి సందర్భంలో బిడ్డలో రక్తం తయారవడం కష్టం. దీంతో రక్తహీనత ఏర్పడి శిశువు మృతి చెందవచ్చు. దీనికి విరుగుడుగా యాంటీ-డి ఇమ్యునో గ్లోబులిన్ అనే మందును ఇస్తున్నాం.
తల్లికి ఏడో నెలలో ఒకసారి 300 మైక్రోగ్రామ్‌లు ఇస్తాం. డెలివరీ అయ్యాక బేబీ బ్లడ్ గ్రూప్ చూసి తల్లికి మరో సారి ఈ మందు ఇస్తాం. దీని వల్ల తరువాతి ప్రెగ్నెన్సీలో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమవదు. ఈ సమస్య ఉన్న కొందరు నెల తప్పి అబార్షన్లు అవుతున్నా గుర్తించలేరు. లేట్ పీరియడ్స్‌గా భావిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ చేసి వాళ్లకు ఈ సమస్య ఉందేమో గుర్తిస్తాం. తర్వాత బిడ్డను పర్యవేక్షిస్తూ అవసరం ఉంటే నేరుగా పిండానికే రక్తాన్ని ఎక్కించి బతికించే ప్రయత్నం చేస్తాం.
తల్లికి షుగర్ ఉంటే… మాయలో నుంచి 24 గంటలూ బిడ్డకు గ్లూకోజు వెళుతూనే ఉంటుంది. కానీ అప్పటికి బేబీ పాంక్రియాజ్ సరిగ్గా ఎదిగి లేకపోతే సరైన మోతాదులో ఇన్సులిన్ తయారు చేయలేకపోవచ్చు. దీంతో గ్లూకోజ్ ఎక్కువగా సరఫరా అవుతూ బేబీ లావు అయిపోతూ ఉంటుంది. కానీ అవయవాలు సక్రమంగా పెరిగి ఉండవు. మ్యాక్రో సోమియాగా పిలిచే ఈ పరిస్థితి కూడా బిడ్డ ప్రాణాలకు ముప్పును తెచ్చేదే. షుగర్ ఉన్న వాళ్లలో 37 వారాలు నిండాక కూడా ఉన్నట్టుండి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి కారణాలు పూర్తిస్థాయిలో తెలియడం లేదు. కానీ వీళ్లను అబ్జర్వేషన్లో ఉంచి, ఎప్పుడైతే మాయలో రక్త ప్రసరణ మందగిస్తుందో అప్పుడు బిడ్డను బయటికి తీయడం ద్వారా బతికించే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు మేనరికంలాంటి జన్యుపరమైన విషయాలు కారణం అవుతాయి. చనిపోయి పుట్టిన బిడ్డకు అటాప్సీ చేయడం ద్వారా ఏ కారణం వల్ల అలా జరిగిందో అంచనా వేసి మళ్లీ అలా కాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇటీవల కొందరిలో ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిదెమటోసస్) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి కనిపిస్తున్నది. అలాంటి వాళ్లకి కిడ్నీలు పాడవుతాయి. దీంతో బీపీ ఉంటుంది. ఈ ఎగుడు దిగుడు బిడ్డ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి.
దీర్ఘకాలిక షుగర్, దీర్ఘకాలిక బీపీ, కిడ్నీ సమస్యలు, తల్లిదండ్రుల్లో తలసేమియా…లాంటి కారణాలెన్నో కడుపులోని బిడ్డకు యమపాశాలు విసురుతుంటాయి. ఇన్నింటికీ తట్టుకుని బిడ్డ గట్టున పడాలంటే నిపుణులైన వైద్యులే శ్రీరామ రక్ష.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్