చిన్నచిన్న ముందస్తు చర్యల వల్ల కూడా ఊహించనంత ఉపయోగం ఉంటుంది. పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనేక శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. దాదాపు 60 శాతం ఆస్తమాను అరికట్టవచ్చు. పరిసరాల కాలుష్యం వల్ల అనేక రోగాలు దాపురిస్తాయి. వీటిలో ప్రధానమైనవి.. శ్వాస వ్యవస్థ వ్యాధులు. వాతా వరణంలోని దుమ్ము రెండు రకాలు. ఒకటి, ఇంట్లోని దుమ్ము. రెండు, వీధిలోని దుమ్ము. బయటి దుమ్ము కన్నా ఇంట్లోని దుమ్మే ప్రమాదకరం. బయటి దుమ్ములో కొన్ని రసాయనాలు, పుప్పొడి ఉంటాయి. ఇంట్లోని దుమ్ము అనేక పదార్థాల మిశ్రమం. ఇందులో కాటన్ ఫైబర్, జంతువుల బొచ్చు, మృత కీటకాల శరీర భాగాలు, మిగిలి పోయిన ఆహార శకలాలే కాకుండా, ఎన్నో ఇతర పదార్థాలూ ఉంటాయి. 70 శాతం ఆస్తమా రోగులకు ఇంట్లో దుమ్ము అలర్జీ ఉంటుంది. పాత ఇళ్లలో ఇది మరీ ఎక్కువ. ఇంట్లోని దుమ్ము వల్ల వచ్చే అలర్జీ సంవత్సరం పొడవునా, ఎప్పుడైనా కనిపించవచ్చు. బయటి కారణాల వల్ల వచ్చే సమస్య మాత్రం ఆయా కాలాల్లోని ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది.
డస్ట్‌మైట్: ఇది ఇంటి దుమ్ములో ఉండే ప్రధాన సూక్ష్మజీవి. మనిషిని కాటు వేయదు. వ్యాధులు వ్యాపింపజేయదు. మనిషి శరీరంపై నుంచి రాలిన చర్మం మీద ఆధారపడి జీవిస్తుంది. దీని స్థావరాలు.. పడకగదిలోని పరుపులు, దిండ్లు, తరచుగా ఉతకడం వీలుకాని ఉన్ని చద్దర్లు, దళసరి గుడ్డలతో చేసిన సోఫాలు. డస్ట్మైట్ను వాక్యూమ్ క్లీనింగ్‌తో పూర్తిగా తొలగించలేం. దీంతో మంచం ఎక్కగానే వ్యాధి లక్షణాలు ప్రారంభం అవుతాయి. ఉదయమే తుమ్ములు, ఆయాసంతో మేల్కొంటారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే ఆ లక్షణాలే కనిపించవు. పిల్లలు పడకగదిలోనే 80 శాతం సమయం గడుపుతారు. కాబట్టి బెడ్రూమ్ను సులువుగా శుభ్రం చేసుకునేందుకు వీలుగా డిజైన్ చేసుకోవాలి. తివాచీలు, సోఫాలూ పడకగదిలో ఉంచరాదు. పరుపులు, దిండ్లు వారానికి రెండుసార్లు దుమ్ము దులిపి ఎండలో ఆరేయాలి.
బొద్దింకలు: ఇవి చీకటి సమయాన వంటగదిలోకి వస్తుంటాయి. వీటి మలం అలర్జీలకు కారణం. బొద్దింకలను నిర్మూలించడానికి పెస్ట్ కంట్రోల్ తప్పనిసరి.
జంతువులు: బొచ్చు, ఈకలు కలిగిన ఏ జంతువైనా అలర్జీకి కారణం కావచ్చు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఎలుకలు, పక్షులు.. అన్నిటికన్నా ప్రమాదకరం. పిల్లి లాలాజలం, వెంట్రుకలు, చర్మం నుంచి రాలే పొడి.. అలర్జీని కలిగిస్తాయి.
పుప్పొడి: చెట్లు, గడ్డి, కలుపు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి వల్ల కూడా అలర్జీ వస్తుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల ద్వారా ప్రవేశించిన పార్థీనియం కలుపు మొక్క అలర్జీకి కారణం అవుతున్నది. వీటితోపాటు.. పొగ కూడా ప్రమాదకరమే. ఫ్యాక్టరీలకు, దుమ్ము, ధూళి ఉండే ప్రధాన రహదారులకు దూరంగా నివసించాలి.
ఎయిర్ కండిషనర్: పుప్పొడి, ఫంగస్ అలర్జీ ఉన్నవారిని ఎయిర్ కండిషనర్ ఆస్తమా నుంచి రక్షిస్తుంది. వంట సమయంలో పాత్రలపై మూతలు ఉంచడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడటం అలర్జీని నియంత్రించే కొన్ని మార్గాలు.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు