Energy | నేటి వేగవంతమైన జీవనశైలిలో శక్తి స్థాయిలు (ఎనర్జీ), స్థైర్యం (స్టామినా) నిలుపుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం పలు రకాల ఆహారాలు, శారీరక కార్యకలాపాలు ఉపయోగపడతాయని తెలిసిందే. అయితే ఇవి మాత్రమే కాకుండా యోగా ఆసనాలను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా కూడా శక్తి, స్థైర్యాన్ని పెంచుకోవచ్చు. యోగా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచి, కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. దీంతో అలసటను మూలంగా తగ్గించడంలో సహాయపడుతుంది. తక్షణ ఫలితాలకంటే యోగా ఆసనాలు శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఇవి శక్తి, సహనాన్ని పెంచడమే కాకుండా మానసిక కేంద్రీకరణను మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. కనుక శక్తి, స్థైర్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన యోగా ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మౌంటెన్ పోజ్ (తాడాసనం) శక్తిని పెంచే ప్రాథమిక ఆసనం. కాళ్లు భుజాలను వెడల్పుగా ఉంచి నిటారుగా నిలబడాలి. భుజాలను వెనక్కి తిప్పి, చేతులను సడలించి పక్కకు ఉంచాలి. తలను స్వల్పంగా లోపలికి వంచి, శరీరాన్ని పైకి లాగుతున్నట్లుగా భావించాలి. లోతుగా శ్వాస తీసుకుంటూ వెన్నెముకను పొడవుగా ఉంచాలి. ఈ ఆసనం శరీరాన్ని స్థిరంగా ఉంచి అలసట వల్ల వచ్చిన చెడు భంగిమను సరిచేస్తుంది. కాళ్లు, మడమలను బలపరుస్తూ, శ్వాసను సక్రమంగా ఉంచుతుంది. రెండవది డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ (అధోముఖ శ్వానాసనం). నాలుగు కాళ్లపై నిలబడి, తరువాత నడుమును పైకి ఎత్తి వి ఆకారంలో శరీరాన్ని ఉంచాలి. చేతులను భుజాల వెడల్పులో ఉంచి వేళ్లను విస్తరించాలి. మడమలను నేల వైపు నెట్టాలి. తలను చేతుల మధ్య సడలించి ఉంచాలి. ఈ ఆసనం శరీరానికి ఉత్సాహాన్ని అందించి మెదడు, గుండెకు రక్తప్రసరణను పెంచుతుంది. ఇది కాళ్లు, వెన్ను, భుజాలకు వ్యాయామం కల్పించి శారీరక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఇక మూడవది వారియర్ I (వీరభద్రాసనం I). ఒక కాలు ముందుకు పెట్టి మోకాలి వద్ద వంచి, వెనుక కాలును 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. చేతులను పైకి ఎత్తి ఉంచి ముందుకు చూడాలి. ఈ ఆసనం కాళ్లు, నడుము, ఛాతీ భాగాలను బలపరచి శక్తిని పెంచుతుంది. లోతైన వ్యాయామం కనుక కాళ్ల బలం, స్థైర్యం పెరుగుతాయి. ఛాతీ విస్తరించడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నాలుగ ఆసనం వారియర్ II (వీరభద్రాసనం II). వారియర్ I నుంచి కాళ్లను మరింత విస్తరించి, చేతులను భూమికి సమాంతరంగా చాపాలి. ముందున్న చేతి వైపు చూడాలి. ఈ ఆసనం కాళ్లలో వేడి సృష్టించి, దిగువ శరీర స్థైర్యాన్ని పెంచుతుంది. నడుము సౌలభ్యాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐదవది చైర్ పోజ్ (ఉత్కటాసనం). కాళ్లు దగ్గరగా ఉంచి, కనిపించని కుర్చీలో కూర్చున్నట్లు మోకాళ్లను వంచాలి. చేతులను పైకి ఎత్తి ఉంచాలి. ఈ ఆసనం తొడలు, నితంబాలు, కోర్ భాగాన్ని బలపరచి శారీరక స్థైర్యాన్ని పెంచుతుంది. ఇది శ్వాస వ్యవస్థను మెరుగుపరచి శక్తిని నిలుపుతుంది.
అదే విధంగా ఆరవ ఆసనం క్రెసెంట్ లంజ్ (అంజనేయాసనం). ఒక కాలు ముందుకు పెట్టి, వెనుక మోకాలును నేలపై ఉంచాలి. చేతులను పైకి ఎత్తి ఛాతీని విస్తరించాలి. ఈ ఆసనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గట్టిపడిన కండరాలను సడలించి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది శ్వాసను లోతుగా తీసుకునేలా చేసి, అలసటను తగ్గిస్తుంది. చివరగా ఏడవ ఆసనం బ్రిడ్జ్ పోజ్ (సేతుబంధాసనం). వెనుకకు పడుకుని మోకాళ్లను వంచి, కాళ్లను నేలపై ఉంచి నడుమును పైకి ఎత్తాలి. ఈ ఆసనం నితంబాలు, వెన్ను, కాళ్లను బలపరచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మెటాబాలిజాన్ని పెంచి నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ విధంగా యోగా ఆసనాలను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా శరీరానికి కావలసిన శక్తి, స్థైర్యం సహజంగా పెరుగుతాయి. ఇవి శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహాన్ని అందిస్తాయని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు.