Apple Cider Vinegar | ఆపిల్ సైడర్ వెనిగర్.. చాలా ఏండ్లుగా వాడుతున్న అద్భుతమైన పానీయం. ఈ పానీయానికి 10 వేల ఏండ్ల చరిత్ర ఉన్నట్లు నిపుణులు చెప్తుంటారు. మన పూర్వీకులు దీన్ని ఔషధాల తయారీలో వినియోగించేవారు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. దీనిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, భాస్వరం, సోడియం, ఫ్లోరిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని నిత్యం పరిగడుపున నీటితో కలిపి తీసుకుంటే భయంకరమైన క్యాన్సర్ వంటి వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతుందని పూర్వీకులు చెప్పేవారు.
ఆపిల్ సైడర్ వెనిగర్ (భApple Cider Vinegar ) ను పులియబెట్టిన ఆపిల్ రసం నుంచి తయారుచేస్తారు. ఇది ప్రధానంగా ఎసిటిక్ యాసిడ్‌తో నిండి పుల్లటి రుచితో ఉండటంతో దీనిని వాడేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరు. ప్రస్తుతం ఎన్నో రకాల ఆపిల్ సైడర్ వెనిగర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. గుండె జబ్బులు వచ్చేందుకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ (LDL) ను ఇది తగ్గిస్తుంది. షుగర్‌తో బాధపడేవారికి చాలా బాగా పనిచేస్తుంది. నడుం చుట్టూ కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. చర్మం పీహెచ్ స్థాయిని స్థిరీకరించడంలో సాయపడి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరంలో హానికారక బ్యాక్టీరియాను చంపడంలో ముందుంటుంది. మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా నిర్వర్తించడంలో సహాయపడుతుంది. ఇలా దీనితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే సమయంలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
జీర్ణ సమస్యలు..
ఆపిల్ సైడర్ వెనిగర్ అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటి వికారం, అతిసారం, అజీర్ణంతో పాటు జీర్ణ సమస్యలు. ఎందుకంటే ఎసిటిక్ యాసిడ్ జీర్ణాశయం లైనింగ్‌ను చికాకుపెడుతుంది. ప్రత్యేకించి ఒకేసారి ఎక్కువగా కానీ లేదా ఖాళీ కడుపుతో ఎక్కువగా కానీ తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఈ దుష్ప్రభావాలను నివారించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్ది మొత్తంలో తీసుకుంటూ మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవడం ఉత్తమం.
దంతాల ఎనామిల్ సమస్యలు..
యాపిల్ సైడర్ వెనిగర్ చాలా ఆసిడ్‌గా ఉంటుంది. ఈ యాసిడ్ దంతాల మీద ఎనామిల్‌ను నాశనం చేస్తుంది. దంతాల సున్నితత్వం, రంగు మారడం, క్యావిటీలకు కూడా దారితీస్తుంది. దంతాల ఎనామిల్ కోత ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడానికి ముందు నీటితో కరిగించడం, త్రాగిన తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
లో పొటాషియం లెవల్స్..
యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో పొటాషియం స్థాయిలను తగ్గిస్తుందని తేలింది. దీనిలోని ఎసిటిక్ యాసిడ్ మూత్రంలో విసర్జించే పొటాషియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు సమస్య కానప్పటికీ.. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి లేదా పొటాషియం స్థాయిలను ప్రభావితం చేసే మందులను తీసుకునే వారికి ప్రమాదకరం అని గుర్తించాలి.
మందుల జోక్యం
యాపిల్ సైడర్ వెనిగర్ మూత్రవిసర్జన, ఇన్సులిన్‌తో పాటు కొన్ని మందుల విషయంలో జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ రక్తపోటును తగ్గిస్తుంది. మూత్ర విసర్జనను పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యాధులకు మందులు వాడుతుంటుంటే.. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
స్కిన్ ఇరిటేషన్..
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి చికాకు కలిగించవచ్చు. ఎందుకంటే ఆపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ కొన్ని చర్మ రకాలకు చాలా కఠినంగా ఉంటుంది. చర్మం చికాకును నివారించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చర్మానికి పూయడానికి ముందు నీటితో కరిగించి.. ముందుగా ఓ ప్రదేశంలో పరీక్షించుకోవడం శ్రేయస్కరం.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.