Potassium Deficiency Symptoms | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుకనే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని పోషకాహాన నిపుణులు, వైద్య నిపుణులు చెబుతుంటారు. మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు సక్రమంగా లభిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. పోషకాల లోపం వస్తే మన శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది. ఇక మన శరీరానికి అవసరం అయిన ముఖ్యమైన పోషకాల్లో ఒకటైన పొటాషియం లోపిస్తే కూడా శరీరం పలు సంకేతాలను సూచిస్తుంది. దాన్ని బట్టి పొటాషియం లోపం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
పొటాషియం మన శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. ఇది లోపిస్తే ఆయా పనులకు ఆటంకం ఏర్పడుతుంది. పొటాషియం స్థాయిలు శరరీంలో తక్కువగా ఉంటే కండరాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. కండరాలు దృఢంగా, గట్టిగా మారుతాయి. ఆ ప్రాంతం మీద చేతితో టచ్ చేస్తే స్పర్శ లేనట్లు అనిపిస్తుంది. శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గితే తీవ్రమైన అలసట, నీరసం కనిపిస్తాయి. చిన్న పని చేసినా విపరీతమైన అలసట వస్తుంది. బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పొటాషియం లోపం ఉంటే కండరాలు బలహీనంగా మారుతాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోతుంటాయి. దీంతో నొప్పి విపరీతంగా ఉంటుంది.
పొటాషియం మన శరీరంలో రక్త సరఫరాను నియంత్రిస్తుంది. పొటాషియం తగినంతగా లేకపోతే రక్త సరఫరాపై నియంత్రణ ఉండదు. దీంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఈ లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. అలాగే పొటాషియం తక్కువగా ఉంటే కొందరికి మలబద్దకం సమస్య కూడా వస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరగదు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం ఏర్పడుతాయి. మలబద్దకంతో ఇబ్బందులు పడుతుంటారు. పొటాషియం లోపం వల్ల శరీరంలో కొన్ని భాగాలపై టచ్ చేస్తే కొందరికి స్పర్శ లేనట్లు అనిపిస్తుంది.
షుగర్ బారిన పడిన వారికి తరచూ దాహంగా అనిపించడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం వంటి సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే పొటాషియం లోపం ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కనుక దీన్ని షుగర్ కావచ్చని కొందరు అనుమానిస్తారు. అయితే షుగర్ టెస్ట్ చేయిస్తే అసలు విషయం తెలిసిపోతుంది. ఒక వేళ షుగర్ లేకున్నా ఈ లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని పొటాషియం లోపంగా అనుమానించాలి. డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. పొటాషియం లోపం వల్ల శ్వాసకకోశ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తులు ఇబ్బందులకు గురవుతాయి. అందుకనే శ్వాసకు సమస్యగా ఉంటుంది. ఇక పొటాషియం మనకు పలు ఆహారాల్లో లభిస్తుంది. అరటి పండ్లు, నారింజ, పాలకూర, చిలగడదుంపలు, అవకాడో, బీన్స్, పెరుగు, చేపలు, ఆలుగడ్డలు, టమాటాలు వంటి ఆహారాలను తింటుంటే పొటాషియం లోపం నుంచి బయట పడవచ్చు.