Pop Corn | మనం ఆహారంగా తీసుకునే చిరుతిళ్లల్లో పాప్కార్న్ కూడా ఒకటి. పిల్లలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. పాప్కార్న్ ను ఎక్కువగా సినిమా వీక్షించే సమయంలో చిరుతిండిగా తింటూ ఉంటారు. టైంపాస్ గా తీసుకునేదే అయినా పాప్కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే ఈ పాప్కార్న్ మార్కెట్ లో మనకు వివిధ రుచుల్లో లభిస్తుంది. ఇన్స్టాంట్ గా చేసుకునే ఈ పాప్కార్న్ లో ఉప్పు, బటర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పాప్కార్న్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. కనుక మనం మైక్రోవేవ్ చేసుకోగలిగిన ఎటువంటి ఫ్లేవర్స్ లేని పాప్కార్న్ ను మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి పాప్కార్న్ మాత్రమే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాప్కార్న్ మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది.. వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏమిటి.. అన్న వివరాలను పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
పాప్కార్న్ ను 100 శాతం తృణధాన్యాలతో తయారు చేస్తారు. కనుక దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను పెంచి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పాప్కార్న్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ గింజల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక చక్కటి చిరుతిండి అని చెప్పవచ్చు.
పాప్కార్న్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేయడంలో సహాయపడతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పాప్కార్న్ ను తీసుకోవడం వల్ల వృద్ధాప్యం, చర్మం ముడతలు పడడం, అల్జీమర్స్, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పాప్కార్న్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాప్కార్న్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా మన శరీర బరువు అదుపులో ఉంటుంది.
పాప్కార్న్ గ్లూటెన్ రహితమైనది. కనుక బ్రెడ్ కు బదులుగా ఏ రెసిపీలోనైనా పాప్కార్న్ ను వాడుకోవచ్చు. చిరుతిండిగా తీసుకోవడానికి కూడా ఇది ఆరోగ్యకరమైనది. ఈ విధంగా పాప్కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని ఉప్పు, కారం, వెన్న, చీజ్, క్యారమెల్ వంటి వివిధ ప్లేవర్స్ తో తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మేలు జరగడానికి బదులుగా మన శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కనుక ఎటువంటి ఫ్లేవర్స్ లేకుండా ఉండే సాధారణ పాప్కార్న్ గింజలను మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనం వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.