Pomegranate Peel Tea | దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. చూడచక్కని ఎరుపు రంగులో చూడగానే తినాలనిపించేలా ఈ పండ్లు మనకు రహదారుల పక్కన దర్శనమిస్తాయి. అందులో భాగంగానే చాలా మంది దానిమ్మ పండ్లను తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లు మాత్రమే కాదు, దాని తొక్క కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దానిమ్మ పండ్లను తిన్న అనంతరం తొక్కను పడేయకుండా దాంతో టీ తయారు చేసి తాగాలి. దానిమ్మ పండు తొక్కను నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేయాలి. ఇలా తయారు చేసి తాగినా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను నయం చేసేందుకు కూడా దానిమ్మ తొక్క ఎంతగానో పనిచేస్తుంది.
దానిమ్మ పండు తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి దానిమ్మ పండ్ల కన్నా తొక్కల్లోనే అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో శరీరంలో అంతర్గతంగా వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. దీంతో చర్మంపై ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. దానిమ్మ పండు తొక్కలతో తయారు చేసిన టీ తాగితే ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుతుంది. ఈ టీలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తాగితే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ పండు తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతమైనవి. ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెరిగేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. దానిమ్మ పండు తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వాడుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ తగ్గుతుంది. దీర్ఘకాలంగా తాగితే డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. దానిమ్మ పండు తొక్కలో టానిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియా నిర్మూలించబడుతుంది. దీని వల్ల రోగాలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
దానిమ్మ పండు తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ టీని సేవిస్తుంటే జీర్ణశక్తి మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ పండు తొక్కలో ఉండే యాంటీ వైరల్ గుణాలు ఇన్ఫెక్షన్లను, జ్వరాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన వారు ఈ టీని తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. ఈ తొక్కల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. దీని వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా దానిమ్మ పండు తొక్కలతో టీని తయారు చేసి తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.