Plant Based Milk | పాలను తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. చిన్నారులకు పోషణ లభించాలంటే కచ్చితంగా పాలను తాగించాల్సి ఉంటుంది. దీంతో వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఇక పెద్దలు కూడా కొవ్వు తీసిన పాలను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే పాలలో లాక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ పడదు. అందువల్ల పాలను తాగితే కొందరికి పడవు. అలర్జీలు వస్తాయి. అయితే అలాంటి వారు వృక్ష సంబంధ పదార్థాలతో తయారు చేసిన పాలను తాగవచ్చు. సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా ఇవి పనిచేస్తాయి. సాధారణ పాలలో ఉండే పోషకాలు అన్నీ ఈ పాలలోనూ ఉంటాయి. ముఖ్యంగా వృక్ష సంబంధ పాలలో లాక్టోజ్ ఉండదు. ఫలితంగా ఈ పాలను ఎవరైనా తాగవచ్చు. పాలు అంటే అలర్జీ ఉన్నవారు వృక్ష సంబంధమైన పాలను తాగుతుంటే పోషకాలను పొందవచ్చు. అలర్జీలు రావు. వృక్ష సంబంధమైన పాలలో పలు రకాలు కూడా ఉన్నాయి.
వృక్ష సంబంధమైన పాల విషయానికి వస్తే బాదంపాలను మొదటి స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మార్కెట్లో మనకు బాదంపాలు లభిస్తాయి. కానీ వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. కనుక బాదంపాలను మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసి తాగవచ్చు. సాధారణ పాలు అంటే ఇష్టం లేని వారు లేదా ఆ పాలు పడని వారు బాదంపాలను తాగవచ్చు. బాదంపప్పులను నీటిలో నానబెట్టి పొట్టు తీసి వాటిలో నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. అనంతరం వడకట్టాలి. దీంతో బాదంపాలు రెడీ అవుతాయి. ఈ పాలలో అవసరం అనుకుంటే కాస్త తేనె వేసి తాగవచ్చు. బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నిషియంతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల బాదంపాలను తాగితే మనకు ఎంతగానో మేలు జరుగుతుంది.
సోయాబీన్స్తోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. సోయాపాలు కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి. కానీ వీటిని కూడా ఇంట్లోనే తయారు చేసి తాగితే మంచిది. ఈ పాలలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. శరీరాన్ని శక్తివంతంగా మారుస్తాయి. ఈ పాలను మనం వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. అలాగే కొబ్బరితో పాలను తయారు చేసి కూడా తాగవచ్చు. ఇందుకు గాను పచ్చి కొబ్బరిని ఉపయోగించాల్సి ఉంటుంది. కొబ్బరిలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి మనకు రోగాలు రాకుండా రక్షిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, హార్ట్ ఎటాక్ రాకుండా చూడడంలో ఓట్స్ ఎంతగానో సహాయ పడతాయి. అయితే వీటితోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. ఓట్స్‌లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక బి విటమిన్లతోపాటు ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్‌ను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇక జీడిపప్పుతోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. ఈ పాలలో జింక్, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పాలను సూప్‌లు, స్మూతీలు, కాఫీలో కూడా ఉపయోగించవచ్చు. అలాగే బియ్యంతోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. వీటిల్లో పిండి పదార్థాలు, పలు రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇలా జంతువులు పాలు పడని వారు లేదా ఆ పాలు అంటే ఇష్టం లేని వారు వృక్ష సంబంధ పదార్థాలతో చేసిన పాలను ప్రత్యామ్నాయంగా తాగవచ్చు. ఈ పాలతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.