లండన్ : కొవిడ్-19 బారినపడిన వారిలో తయారయ్యే యాంటీబాడీలతో పోలిస్తే ఫైజర్, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్లతో ఎక్కువగా యాంటీబాడీలు తయారవుతాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ యాంటీబాడీలు డెల్టా వేరియంట్‌పైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మోంట్రీల్ పరిశోధకులు బృందం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వైరస్ సోకిన వ్యక్తితో పోలిస్తే ఫైజర్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బాడీల స్ధాయి రెట్టింపుగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
వీరిలో తయారైన యాంటీబాడీలు స్పైక్-ఏసీఈ-2 ఇంటరాక్షన్‌ను కూడా మెరుగ్గా నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు. గతంలో వైరస్ సోకిన వారికి డెల్టా వేరియంట్ నుంచి కూడా వ్యాక్సినేషన్ మెరుగైన రక్షణ కల్పిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ మోంట్రీల్ ప్రొఫెసర్ జీన్ ఫ్రాంకోయిస్ మాసన్ తెలిపారు. వైరస్ అన్ని వేరియంట్లను దీటుగా ఎదుర్కొనే యాంటీబాడీలను సమర్ధంగా ఎలా నిర్వహించాలనే దానిపై మరింత పరిశోధన సాగాలని పరిశోధకులు పేర్కొన్నారు.