Papaya | బొప్పాయి పండ్లు మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లు తియ్యగా, ఎంతో రుచగా ఉంటాయి. బొప్పాయి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్ల ముక్కలను ఫ్రూట్ సలాడ్‌లో వేసి తింటుంటారు. బొప్పాయిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల అనేక లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని కొందరు మాత్రం తినకూడదు.
అలర్జీలు ఉన్నవారు బొప్పాయి పండ్లను తినకూడదు. బొప్పాయి పండ్లను అతిగా తిన్నా కూడా అలర్జీలు వస్తాయి. బొప్పాయి పండ్లలో ఉండే ఎంజైమ్‌ల మోతాదు శరీరంలో ఎక్కువైతే అలర్జీలు వస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక అలర్జీలు ఉన్నవారు ఈ పండు జోలికి పోకపోవడమే మంచిది. అలాగే విరేచనాల సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండ్లలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి మలం బయటకు వచ్చేలా చేస్తాయి. కనుక మలబద్దకం ఉన్నవారికి మేలు జరుగుతుంది. కానీ విరేచనాలు ఉన్నవారు తింటే మాత్రం సమస్య ఎక్కువవుతుంది. కనుక విరేచనాల సమస్యతో బాధపడుతున్న వారు కూడా బొప్పాయి పండ్లను తినకూడదు.
బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పండ్లను అధికంగా తింటే అజీర్తి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు బొప్పాయి పండ్లను మోతాదులో తింటేనే ఫలితం ఉంటుంది. అతిగా తింటే మాత్రం సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అలాగే గర్భిణీలు కూడా బొప్పాయి పండ్లను తినకూడదు. ఇవి గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతాయి. దీని వల్ల ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి గర్భిణీలు కూడా ఈ పండ్లకు దూరంగా ఉండాలి. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ పండ్లను తినడం ఉత్తమం. లేదంటే విరేచనాలు లేదా వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి.
బొప్పాయి పండ్లలో ఉండే ఎంజైమ్‌ల కారణంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్ సూచన మేరకే ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల మందులు వాడే వారు కూడా బొప్పాయి పండ్లను తినకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కోసం మందులను వాడుతున్న వారు డాక్టర్ సూచన మేరకే ఈ పండ్లను తినాలి. ఈ విధంగా బొప్పాయిని తినడంలో కచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.