Lungs Problems | లడాఖ్, కాశ్మీర్, స్పితి వ్యాలీ వంటి ఎత్తైన పర్వత ప్రాంతాలను సందర్శించడం చాలామంది ప్రయాణికుల కల. అయితే ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారిలో ఒక సందేహం తరచూ ఉంటుంది. అలాంటి వారు అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణించవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. అయితే ఇందుకు శ్వాసకోశ నిపుణులు సమాధానం చెబుతున్నారు. సరైన ప్రణాళిక, వైద్యుల సలహా, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది రోగులు కూడా ఇలాంటి ప్రాంతాలను సురక్షితంగా సందర్శించవచ్చని వారు పేర్కొంటున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గుతాయి. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. ఆరోగ్యవంతులకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, ఎత్తు ప్రభావానికి సంబంధించిన లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి.
అయితే ఊపిరితిత్తుల వ్యాధి ఉందంటే తప్పనిసరిగా పర్వత ప్రాంతాలకు వెళ్లకూడదని కాదు. వైద్యుల సలహా తీసుకుని ప్రయాణానికి ముందు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవడం, వ్యాధి నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడం, అవసరమైన మందులను వెంట తీసుకెళ్లడం, క్రమంగా ఎత్తుకు అలవాటు పడేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవడం, శరీరానికి తగినంత నీరు అందించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయవచ్చు. ప్రయాణానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనే విషయం కేవలం వ్యాధి పేరును బట్టి కాకుండా, అది ఎంతవరకు నియంత్రణలో ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణానికి ముందు ప్రస్తుతం ఉన్న లక్షణాలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఊపిరితిత్తుల పనితీరు, ప్రయాణ వ్యవధి, వెళ్లే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను వైద్యులు పరిశీలిస్తారు. ఆస్తమా లేదా సీఓపీడీ బాగా నియంత్రణలో ఉండి, ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉంటే లడాఖ్, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు ప్రయాణించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
అధిక ఎత్తులో శారీరక శ్రమ సాధారణం కంటే ఎక్కువగా అనిపిస్తుందని గుర్తుంచుకోవాలి. కొద్దిదూరం నడవడం, మెట్లు ఎక్కడం, లగేజీ మోయడం వంటి పనులే ఎక్కువ అలసటను కలిగిస్తాయి. అందువల్ల తొందరపాటు ప్రయాణ ప్రణాళికలను నివారించి, శరీరం వాతావరణానికి అలవాటు పడేందుకు తగిన సమయం ఇవ్వాలి. ప్రయాణంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరగడం, తగ్గని దగ్గు, తల తిరగడం, ఛాతిలో అసౌకర్యం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమయ్యే రోగులు ముందుగానే వైద్యులను సంప్రదించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విమాన ప్రయాణానికి అవసరమైన ఫిట్నెస్ అంచనా, ఎయిర్‌లైన్ అనుమతులు, గమ్యస్థానంలో ఆక్సిజన్ సదుపాయం వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసుకోవడం అవసరం.
అలాగే మోస్తరు నుంచి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ప్రయాణానికి ముందు పల్మనరీ ఫంక్షన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇన్ఫ్లుయెంజా, న్యుమోనియా వ్యాక్సిన్లు కూడా తీసుకోవడం వల్ల ప్రయాణ సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధి ఉందనే కారణంతో ప్రయాణాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన వైద్య సలహా, ముందస్తు ప్రణాళిక, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎంతోకాలంగా అనుకున్న పర్వత ప్రాంతాల సందర్శనను కూడా సురక్షితంగా ఆస్వాదించవచ్చు.