న్యూయార్క్ : మద్యపానంతో ఆరోగ్యం కుదేలవుతుందని, పలు వ్యాధుల బారినపడతారని వైద్య నిపుణులు (Health Tips) హెచ్చరిస్తుంటారు. మద్యంతో లివర్ దెబ్బతింటుందని, కాలేయ క్యాన్సర్ బారినపడే ముప్పు అధికమని వైద్యులు చెబుతున్నారు. మద్యంతో అనారోగ్యాల ముప్పు తగ్గించాలంటే పరిమిత మోతాదులో రాత్రి వేళ కాకుండా మధ్యాహ్నం మద్యం తీసుకోవాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేసేందుకు శరీరానికి తగినంత సమయం ఉంటుందని, మద్యం అలవాటున్న వారు రాత్రిళ్లు కాకుండా మధ్యాహ్నం వేళ మితంగా మద్యం తీసుకోవాలని అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ పలనియప్పన్ మాణికమ్ చెప్పారు.
రాత్రి వేళ జీవక్రియలు మందకొడిగా ఉండటంతో ఆ సమయంలో మద్యం తీసుకుంటే జీర్ణ వ్యవస్ధ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇక పరిమిత మోతాదులో మద్యం తీసుకుంటే సాధారణ నొప్పుల బాధలు తప్పుతాయని కేంబ్రిడ్జి, సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో నొప్పికి దారితీసే వాపు, ఇన్ప్లమేషన్ కలిగించే కెమికల్స్‌ను బ్లాక్ చేసే సామర్ధ్యం పరిమిత స్ధాయిలో తీసుకునే మద్యానికి ఉంటుందని చెబుతున్నారు.
ఆల్కహాల్లో ఉండే ఒత్తిడిని చిత్తు చేసే ఎఫెక్ట్స్ మేలు చేస్తాయని పరిశోధకులు వివరించారు. అయితే ఇదే సమయంలో మోతాదుకు మించి మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మద్యం అధికంగా తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, సైకియాట్రిక్ డిజార్డర్స్ చుట్టుముడతాయి. సురక్షిత డ్రింకింగ్ అంటే పరిమితంగా మద్యం తీసుకోవడమేనని, వారానికి 14 యూనిట్లలోపు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Read More