Morning Mistakes | అధిక బరువు తగ్గడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసేవారు. కనుక వారు చాలా దృఢంగా ఉండేవారు. అధిక బరువు పెరిగేవారు కాదు. వయస్సు మీద పడినప్పటికీ ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా కాదు. చిన్నారులు సైతం ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్‌ను పాటించడం, వ్యాయామం చేయడం వంటివి అనుసరిస్తారు. కానీ అనుకున్న రీతిలో బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే చాలా మంది ఉదయం పలు రకాల తప్పులు చేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు. ఆయా తప్పులు ఏమిటో తెలుసుకుని జాగ్రత్త పడితే అధిక బరువును సులభంగా తగ్గించుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపునే టీ, కాఫీలను సేవిస్తారు. అలా తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. అయితే వాస్తవానికి బరువు పెరిగేందుకు ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు అయినా సరే ఉదయం పరగడుపునే టీ, కాఫీలను తాగడం వల్ల బరువు తగ్గలేకపోతుంటారు. టీ, కాఫీలలో ఉండే చక్కెర కారణంగా బరువు పెరుగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. కనుక ఉదయం పరగడుపున ఆ పానీయాలను తాగకూడదు. వాటికి బదులుగా గోరు వెచ్చని నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే ఇంకా మేలు చేస్తాయి. దీని వల్ల బరువు త్వరగా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.
చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత చక్కెర అధికంగా ఉండే పండ్ల రసాలను తాగుతారు. లేదా టీ, కాఫీలలోనూ చక్కెర అధికంగా కలిపి తాగుతారు. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గాలనుకునే లక్ష్యం నెరవేరదు. పైగా బరువు పెరుగుతారు. టీ, కాఫీలను చక్కెర కలపకుండా తాగాలి. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ అయితే ఇంకా మేలు జరుగుతుంది. అలాగే పండ్ల రసాలు కూడా ఇంట్లో తయారు చేసుకున్నవి తాగాలి. బయట చక్కెర వేసి తయారు చేసినవి తాగకూడదు. వీటి వల్ల బరువు పెరుగుతారు. అలాగే ప్యాక్ చేయబడిన పండ్ల రసాలను సైతం ఉదయం తాగకూడదు. వీటిల్లోనూ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి హాని చేస్తుంది. బరువు పెరిగేలా చేస్తుంది. అలాగే అధిక బరువు వేగంగా తగ్గాలని చెప్పి కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. నేరుగా మధ్యాహ్నం లంచ్ తింటారు. కానీ ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అలా చేయడం వల్ల రోజులో ఇతర సమయాల్లో జంక్ ఫుడ్‌ను అధికంగా తింటారని, దీంతో అధికంగా బరువు పెరుగుతారని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక ఉదయం తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. మానేయకూడదు.
చాలా మంది బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నప్పటికీ ఉదయం జంక్ ఫుడ్‌ను తింటారు. నూనె పదార్థాలను తరచూ తింటుంటారు. వీటి వల్ల శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. దీంతో బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. దీని వల్ల బరువు తగ్గాలనుకునే లక్ష్యం నెరవేరదు. కనుక ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు, శక్తినిచ్చే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఉదయం కోడిగుడ్లు, ఓట్స్, తృణ ధాన్యాలను తింటుంటే మేలు జరుగుతుంది. ఇవి శక్తిని, పోషకాలను అందిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. దీంతో చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. అలాగే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. ఇక కొందరు ఉదయం నిద్ర లేచిన తరువాత కూడా చాలా సేపు బెడ్ మీద అలాగే పడుకుని ఉంటారు. ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు. ఇది చాలా అనారోగ్యకరమైన చర్య. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం చేసే పొరపాట్లలో ఇది కూడా ఒకటి. ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ మీద నుంచి దిగి కాలకృత్యాలను మొదలు పెట్టాలి. యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే బరువు త్వరగా తగ్గడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇలా ఉదయం ఆయా తప్పులను చేయకుండా ఉంటే బరువు తగ్గాలనుకునే లక్ష్యం చాలా త్వరగా నెరవేరుతుంది.