అమ్మతనంలో ఉన్న కమ్మదనం, ఆప్యాయత, ప్రేమానురాగం మరెక్కడా ఉండదు. ప్రతి స్త్రీ మూర్తీ మాతృమూర్తిగా మారాలని పరితపిస్తుంటుంది. ఈ సృష్టిలో ఎంత సంపద ఉన్నా సంతానంతో వెలకట్టలేం. అందుకే సకాలంలో సంతానం కలగాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. అయితే, చాలామంది సంతాన సాఫల్యం అయ్యే వయసులోనే వంధ్యత్వంతో బాధపడుతున్నారు. సంతానం కోసం అటు దవాఖానల చుట్టూ, ఇటు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. గతంతో పోలిస్తే.. గర్భదారణ విషయంలో స్త్రీ వెనుకబడిపోతున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిళ్లు ఇవన్నీ ఆమెను అమ్మ కాకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పీసీఓడీ సమస్య అమ్మతనానికి అడ్డంకిగా మారుతున్నది.
హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తూ పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) మహిళలను మౌనంగా వేధిస్తున్నది. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య నేడు చాలామంది మహిళల్లో కనిపిస్తున్నది. ఈ సమస్య ఆడవాళ్లలో సర్వసధారణంగా మారిపోయింది. ప్రతి 100మందిలో 60 శాతం మంది మహిళలు, యువతులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ ఊబకాయం పరోక్షంగా పీసీఓడీకి దారితీస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురయ్యే పీసీఓడీ వల్ల ముఖ్యంగా మహిళల్లో సంతాన లేమి సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఈ పీసీఓడీ అంటే ఏంటీ?, ఇది రావడానికి గల ప్రధాన కారణాలు, పీసీఓడీ వల్ల కలిగే అనర్థాలు, సమస్య నిర్ధారణ పరీక్షలు, వ్యాధి లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు (సిస్టులు) ఏర్పడతాయి. ఈ విధంగా అండాశయంలో ఏర్పడే సిస్టులనే వైద్య పరిభాషలో ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్’ (పీసీఓడీ) అంటారు. అండాశయాలకు సంబంధించిన హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పీసీఓడీ సమస్య ఉత్పన్నమవుతుంది. అండాశయంలో ఏర్పడిన సిస్టులు అండాల విడుదల (ఓవులేషన్)ను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మహిళల్లో సంతాన లేమి సమస్య ఎదురవుతుంది. గతంలో ఈ సమస్య చాలా అరుదుగా కనిపించేది. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల పీసీఓడీ సర్వసాధారణమైన రుగ్మతగా మారిపోయింది. అయితే ఇది చిన్న సమస్యలా కనిపించినా, దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిణమించే ప్రమాదం ఉంది. అందుకని ప్రారంభ దశలోనే గుర్తించి, డాక్టర్ సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం.

పీసీఓడీ సమస్య సాధారణంగా 12-45 ఏళ్ల మధ్య వయసు గల వారిలో వస్తుంది. ఈ సమస్య కారణంగా అండాశయాలు అపరిపక్వ గుడ్లను విడుదల చేస్తాయి. అందుకనే ఈ సమస్య ఉన్న మహిళల్లో గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి.


సకాలంలో వ్యాధిని గుర్తిస్తే ఎక్కువ మందులు అవసరం లేకుండా చికిత్స చేయవచ్చు. పీసీఓడీ సమస్యకు శస్త్రచికిత్స చేయడం అనేది చాలా అరుదు. 90 శాతం సందర్భాల్లో.. మందులు, జీవన శైలి, ఆహారపు అలవాట్ల మార్పుతోనే వ్యాధిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా మందుల ద్వారా హార్మోన్లను సమతుల్యం చేయవచ్చు. నెలసరి సక్రమంగా రావడానికి, ఇన్సులిన్ నియంత్రణ కోసం మందులు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ప్రస్తుతం బైలాజికల్ సైకిల్‌ను సాధారణ స్థాయికి తీసుకురావడం వల్ల మందులు లేకుండానే సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంటే ఒత్తిడి తగ్గించడం, బరువు తగ్గించడం, సమయానికి నిద్ర పోవడం వంటి చర్యలతో సమస్యను నివారించవచ్చు. అంతే కాకుండా పీసీఓడీ కారణంగా సంతానలేమితో బాధపడే రోగులకు లాపరోస్కోపిక్ సర్జరీ (ఒవేరియన్ డ్రిల్లింగ్), ఐవీఎఫ్, ఐయూఐ లాంటి ఫర్టిలిటీ చికిత్స, హార్మోన్ థెరపీ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
పీసీఓడీ బారిన పడకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది.
సమతుల ఆహారం తీసుకోవాలి
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ బొమ్మినేని దుర్గా రాణి
అబ్‌స్టెట్రీషియన్ & గైనకాలజిస్ట్
బొమ్మినేని హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్
కోకాపేట, హైదరాబాద్