నడకకు కొత్తజీవం.. తేలికగా తుంటి మార్పిడి
తుంటి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న రోగులకు మందులు పనిచేయని పరిస్థితిలో చివరి అవకాశం హిప్ రీప్లేస్‌మెంటే! అయితే ఒకప్పుడు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అంటే చాలామంది భయపడేవారు. కారణం పెద్ద కోత, తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, వారాల తరబడి దవాఖానలో గడపడం, నెలల తరబడి విశ్రాంతి. ఇవన్నీ రోగిని కంగారుపెట్టేవి.
తుంటి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న రోగులకు మందులు పనిచేయని పరిస్థితిలో చివరి అవకాశం హిప్ రీప్లేస్‌మెంటే! అయితే ఒకప్పుడు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అంటే చాలామంది భయపడేవారు. కారణం పెద్ద కోత, తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, వారాల తరబడి దవాఖానలో గడపడం, నెలల తరబడి విశ్రాంతి. ఇవన్నీ రోగిని కంగారుపెట్టేవి. అంతేకాదు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తేవి.కానీ, గత 10-15 సంవత్సరాల్లో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ (టీహెచ్ఆర్) పద్ధతి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దీనివల్ల రోగి వేగవంతంగా కోలుకునే వెసులుబాటు ఏర్పడింది. అంతేకాకుండా, చిన్నకోత, తకువ నొప్పి, సుమారు 25-30 సంవత్సరాలపాటు మన్నికగా ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంతో మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడుతూ జీవన నాణ్యత కోల్పోయినవేలాది మంది రోగులు మరోసారి చురుకైన జీవితాన్ని అందుకోగలుగుతున్నారు. అయితే హిప్ రీప్లేస్మెంట్లోవచ్చిన ఆధునిక పద్ధతులు, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
పాత పద్ధతుల్లో జరిపే తుంటి శస్త్రచికిత్సలో.. కండరాలను లోతుగా కోయాల్సి వచ్చేది. దీనివల్ల రక్తస్రావం అధికంగా ఉండేది. తీవ్రమైన నొప్పి బాధించేది. కానీ, ఇప్పుడు ముందువైపు నుంచి కండరాల మధ్యలోనే శస్త్రచికిత్స (అంటీరియర్ అప్రోచ్) చేయడం వల్ల కండరాలు ఎక్కువగా దెబ్బతినకుండా ఉంటాయి. రక్తస్రావం తక్కువే! అంతేకాకుండా నొప్పి కూడా తక్కువగానే ఉండటం వల్ల రోగులు త్వరగా కోలుకుంటారు. కొంతమంది రోగులు 1-2 వారాల్లోనే ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారు.
మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీ (ఎంఐఎస్)
గతంలో అయితే 10-12 అంగుళాల కోతలు పెట్టాల్సి వచ్చేది. ఎంఐఎస్ పద్ధతి ద్వారా ఇప్పుడు కేవలం 3 నుంచి 5 అంగుళాల చిన్నపాటి కోతలతోనే సర్జరీ పూర్తి చేస్తున్నారు. ఫలితంగా రక్తస్రావం తగ్గి, గాయం త్వరగా మానిపోవడంతో పాటు దవాఖానలో గడపాల్సిన రోజులు కూడా తగ్గుతున్నాయి.
ఈఆర్ఏఎస్ ప్రొటోకాల్స్
ఎన్ హాన్స్‌డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ (ERAS) విధానంలో శస్త్రచికిత్సకు ముందే రోగికి అవగాహన కల్పించడం, ఎకువసేపు ఉపవాసం లేకుండా చూసుకోవడం, సర్జరీ తర్వాత త్వరగా నడక ప్రారంభించడం వంటి చర్యలు ఉంటాయి. గతంలో 4-5 రోజులు దవాఖానలో ఉండాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు చాలామంది రోగులు ఒకే రోజులో లేదా ఒక రాత్రిలోనే దవాఖాన నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. కొంతమంది రోగులకు శస్త్రచికిత్స చేసిన 4-8 గంటల్లోనే ఇంటికి పంపించే స్థాయికి వైద్యరంగం చేరుకుంది. దీనినే ఔట్‌పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్ అని వ్యవహరిస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలోనే ఎక్స్ రే లేదా ఫ్లోరోసోపీ ద్వారా కప్ పొజిషన్, కాలి పొడవు, జాయింట్ స్థిరత్వం సరిగ్గా ఉన్నాయా లేదా అనేది వైద్యులు చెక్ చేస్తున్నారు.
కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ: సెన్సర్లు, డిజిటల్ మానిటర్ల సహాయంతో ఇంప్లాంట్‌ను కచ్చితమైన కోణంలో అమర్చే విధానం అభివృద్ధి చెందింది. దీంతో జాయింట్ డిస్లొకేషన్ ప్రమాదం తగ్గుతున్నది.
3డీ ప్రీ-ఆపరేటివ్ ప్లానింగ్: రోగి తుంటికి సంబంధించిన సీటీ సాన్ లేదా ఎక్స్-రే ఆధారంగా 3డీ మాడల్ తయారు చేసి, ముందుగానే ఇంప్లాంట్ పరిమాణం, పొజిషన్ ప్లాన్ చేస్తున్నారు.

రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్
రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రోబో సహాయంతో ఇంప్లాంట్‌ను అత్యంత కచ్చితంగా అమర్చగలుగుతున్నారు. వైద్య, ఆరోగ్యరంగ అధ్యయనాల ప్రకారం, సాధారణ పద్ధతిలో 70-80 శాతం కచ్చితత్వం ఉంటే, రోబోటిక్ విధానంలో ఇది 95 శాతం కంటే ఎక్కువగా ఉంటున్నది.

అత్యాధునిక ఇంప్లాంట్లు
సిమెంట్ లెస్ ఫిక్సేషన్: టైటానియం పూతతో తయారైన ఇంప్లాంట్లలో ఎముక సహజంగా పెరిగి కలిసిపోతుంది. యువకులు, చురుకైన జీవితం గడిపేవారికి ఇవి ఎకువకాలం మన్నుతాయి.
షార్ట్ స్టెమ్స్: ఎముకను ఎకువగా కాపాడే ఈ పద్ధతి భవిష్యత్తులో అవసరమైతే రివిజన్ సర్జరీని సులభతరం చేస్తుంది.
డ్యుయల్ మొబిలిటీ కప్స్: కప్‌లో కప్ తరహా డిజైన్‌తో ఉండే ఈ ఇంప్లాంట్లు డిస్లొకేషన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
3డీ ప్రింటెడ్ కస్టమ్ ఇంప్లాంట్లు: 3డీ ప్రింటెడ్ కస్టమ్ ఇంప్లాంట్లు అంటే ఎముక నష్టం ఎకువగా ఉన్న రోగులకు లేదా ప్రత్యేక శరీర నిర్మాణం ఉన్నవారికి వ్యక్తిగతంగా సరిపోయే ఇంప్లాంట్లు తయారు చేస్తున్నారు.
మన్నిక పెంచిన కొత్త బేరింగ్స్
హిప్ జాయింట్లో బాల్, సాకెట్ మధ్య రాపిడి తకువగా ఉండటం చాలా ముఖ్యం. ఆధునిక హైలీ క్రాస్ లింక్డ్ పాలిథిలీన్, విటమిన్ ఇ టెక్నాలజీ వల్ల ఇంప్లాంట్ల మన్నిక గణనీయంగా పెరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాల పాటు పనిచేసే హిప్ ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి.
నొప్పి నియంత్రణలో విప్లవం
మల్టీమాడల్ అనల్జీసియా అంటే భారీ మోతాదులో నొప్పి మందులు కాకుండా, పలు రకాల మందులను కలిపి ఇవ్వడం. దీనివల్ల నొప్పి నియంత్రణ మెరుగుపడుతున్నది. మత్తు మందుల వినియోగం 50-80 శాతం వరకు తగ్గింది.
పెంగ్ నర్వ్ బ్లాక్: అల్ట్రాసౌండ్ సహాయంతో ఇచ్చే ప్రత్యేక నర్వ్ బ్లాక్ వల్ల కాళ్ల బలం తగ్గకుండా నొప్పి నియంత్రణ సాధ్యమవుతున్నది. దీంతో శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే రోగి నడవగలుగుతున్నాడు.
ట్రానెక్సామిక్ యాసిడ్ (టీఎక్ఏ): రక్తస్రావాన్ని తగ్గించే ఈ ఔషధం వల్ల రక్త మార్పిడి అవసరం 20 శాతం నుంచి 1 శాతం కంటే కూడా తకువకు పడిపోయింది.
ప్రీహ్యాబ్, డిజిటల్ ఫిజియోథెరపీ: సర్జరీకి ముందే వ్యాయామాలు చేయించడం, మొబైల్ యాప్స్, వేరబుల్ సెన్సర్ల ద్వారా ఇంటి నుంచే ఫిజియోథెరపీ మార్గదర్శకాలు ఇవ్వడం ఇప్పుడు సర్వసాధారణమైంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
హిప్ రీప్లేస్మెంట్ తర్వాత మొదటి 6-12 వారాలు అత్యంత కీలకం. ఈ సమయంలో పలు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
వాటిలో ముఖ్యమైనవి..
- సర్జరీ జరిగిన రోజే వైద్యుల సూచనలతో నడక ప్రారంభించాలి.
- ప్రతిరోజూ ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయాలి.
- నిద్రపోయేటప్పుడు కాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలి.
- ఎత్తయిన కుర్చీలు, రైజ్డ్ టాయిలెట్ సీట్లు ఉపయోగించాలి.
- రక్తగడ్డలు ఏర్పడకుండా వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.
- జ్వరం, కాలి నొప్పి, గాయం నుంచి నీరు కారడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చేయకూడనివి
- ఆపరేషన్ చేసిన కాలుపై ఒకసారిగా బరువు మోపకూడదు.
- నేలపై ఉన్న వస్తువులు వంగి తీసుకోకూడదు.
- కాళ్లు ఒకదానిపై ఒకటి వేసుకుని కూర్చోకూడదు.
- ఎత్తు తక్కువగా ఉండే సోఫాలు, కుర్చీలు ఉపయోగించకూడదు.
- వైద్యుల అనుమతి లేకుండా వాహనం నడపకూడదు.
- పరుగు, జంపింగ్, హై ఇంపాక్ట్ క్రీడలు ఆడకూడదు.
- బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.
- మూడు నెలల తర్వాత చాలామంది రోగులు సాధారణ జీవితానికి చేరుకుంటారు. సైక్లింగ్, ఈత, గోల్ఫ్, హైకింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అయితే తుంటిపై అధిక ఒత్తిడి పడే యోగా భంగిమలకు, అలసట, వేగంతో కూడుకున్న క్రీడలకు దూరంగా ఉండటం మంచిది.
-మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి
ఆర్థోపెడిక్ సర్జన్, తుంటి మార్పిడి నిపుణులు
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

